CJIగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి హైదరాబాద్ వరకు వచ్చిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణను కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీ. హన్మంతరావుతో పాటు మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తదితరులు CJI జస్టిస్ ఎన్వీ రమణను కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాము CJI జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పామన్నారు. తెలుగు వ్యక్తి అత్యున్నత పదవిలో ఉండడం తెలుగువారందరికీ గర్వ కారణమని అన్నారు. CJI జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలో న్యాయవ్యవస్థ మరింత ఉన్నత స్థితికి వెళ్తుందని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. CJI జస్టిస్ ఎన్వీ రమణ తెలుగువాడిగా ఉండడంతోపాటు తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 42కి పెంచడంపై ధన్యవాదాలు తెలిపామని వ్యాఖ్యానించారు. కాగా న్యాయమూర్తుల ఎంపికలోనూ సామాజిక న్యాయ సూత్రం (సోషల్ జస్టిస్) పాటించాలని CJIగా బాధ్యతలు స్వీకరించాక జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలను తాము సాదరంగా స్వాగతిస్తున్నామని వ్యాఖ్యానించారు.
మంత్రి ఎర్రబెల్లి..
కాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణను తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేఐకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
రేపు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి CJI ప్రత్యేక పూజలు
CJI జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం యాదాద్రి వెళ్లనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకోనున్నారు. కాగా సీజేఐతో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్ కూడా యాదాద్రికి వెళ్లనున్నారు. సీజేఐతో పాటు గవర్నర్, సీఎం ఆలయానికి వస్తున్న నేపథ్యంలో యాదాద్రిలో ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలూ ముమ్మరం చేశారు.
Must Read ;- తరలిన తెలంగాణ కేబినెట్.. CJI జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం










