కీలక మలుపులు తిరుగుతున్న మాజీమంత్రి వివేకా హత్య కేసు రోజుకో ట్విస్ట్ ఇస్తోందా ? కేసును అన్నీ కోణాల్లో జల్లేడపడుతున్న సిబిఐ ఇంతవరకు సాధించింది ఏమిటి ? అసలు హత్య వెనుక ఉన్న సూత్రదారులు , పాత్రదారులు ఎవరు ? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసును సిబిఐకి అప్పగించాలని పట్టుబట్టిన వైసీపీ అధికారంలోకి వచ్చాక అదే సిబిఐని తప్పుపడుతోందా ? వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ఏంటి ? సిబిఐ చార్జ్ షీట్ పై అధికార పార్టీ నేతల్లో అలజడి దేనికి ?
సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూ కొత్త ట్విస్ట్ లు ఇస్తోంది..2019 మార్చి 15 న పులివేందులలోని తన నివాసంలో వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన వివేకా వంటి వ్యక్తి తన సొంత నివాసంలో అతిదారుణంగా హత్యకు గురికావడం అప్పట్లో తీవ్ర కలకలమే రేపింది. ఇక అది ఎన్నికల సమయం కూడా కావడంతో ఈ హత్య రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టించింది.
మొదట వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారంటూ చెప్పిన అప్పటి ప్రతిపక్ష ప్రస్తుత అధికార పార్టీ నేతలు కొద్ది గంటల్లోనే మాట మార్చి గుండెపోటు కాదు దారుణంగా హత్యకు గురయ్యారు అని చెప్పడం హై డ్రామానే తలపించింది. అనంతరం వివేక హత్య వెనుక రాజకీయ కోణం దాగిఉందని, దీని వెనుక చంద్రబాబు, టిడిపి నేతల హస్తం ఉందంటూ వైసీపీ నేతలు పెద్దఎత్తున ప్రచారం కూడా చేశారు.దీంతో అప్పటి ఆపద్ధర్మ తెలుగుదేశం ప్రభుత్వం హత్య కేసును దర్యాప్తు చేసేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే తమకు సిట్ పై నమ్మకం లేదని, కేసును సిబిఐకి అప్పగించాలని వివేకా కుమార్తె సునీత రెడ్డి, అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండ్ కో డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేసును సిబిఐకి అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జగన్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
ఇక ఎన్నికలు అయిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక వివేకా కేసు త్వరలోనే ఒక కొలీక్కి వస్తుందని అంతా ఆశిస్తున్న సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిచ్చాయట.ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండగా వివేకా కేసును సిబిఐకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పిటిషన్ ను వెనక్కి తీసుకోవాడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.ఇక పిటిషన్ వెనక్కి తెసుకున్న జగన్ అప్పటివరకు కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ను రద్దు చేసి, ముఖ్యమంత్రిగా తన ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున మరో సిట్ ని ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే జగన్ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు పై అసంతృప్తి చెందిన వివేకా కుమార్తె సునీత రెడ్డి తన తల్లితో కలిసి వివేకా హత్య కేసును సిబిఐకి అప్పగించాలని కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా సిట్ అధికారులు కేసును మాసిపోవసి మారేడుకాయ చేసేలా వ్యవహరిస్తున్నారనై, హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే కుట్ర కూడా జరుగుతోందనే అనుమానాలను వ్యక్తం చేస్తూ సునీత రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అనేక మలుపులు, రాజకీయ ఆరోపణల తరువాత వివేక కుమార్తె సునీత రెడ్డి పోరాటంతో హత్య కేసులో సీబీఐ విచారణ మొదలైంది.
ఇక అనేక విడతలుగా విచారణ చేసిన సీబీఐ కేసును కొలీక్కి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. గతంలో వివేకా వద్ద కారు డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి తో మొదలైన సిబిఐ విచారణ కడప ఎంపీ వైయస్ అవినాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి వరకూ వచ్చింది. ఇప్పటికే దస్తగిరి ఈ కేసులో అప్రువల్ గా మారి
హత్యకు సంబంధించిన వివరాలను సీబీఐ అధికారులను చెప్పాడు.సీబీఐ అధికారులు సైతం దస్తగిరి వాంగ్మూలాన్ని కోర్ట్ సమక్షంలో సేకరించి పెట్టుకున్నారు .ఇక దస్తగిరి వాంగ్మూలంలో ఇచ్చిన వివరాల ఆదారంగా సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు.
సిబిఐ అధికారులు చేపట్టిన విచారణలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఎంపీ అవినాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు,
వైసీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దగ్గర నుంచి ఎర్రగంగిరెడ్డికి వివేకాను చంపమని సమాచారం వచ్చినట్లు దస్తగిరి తన వాంగ్మూలంలో పేర్కొంటూ హత్య జరిగిన విధానాన్ని సిబిఐ అధికారులకు వివరించాడు.వివేకాను హత్య చేసేందుకు 40 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకున్న ఎర్రగంగిరెడ్డి.. హత్యకు సహకరిస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తానని దస్తగిరి, సునీల్ కుమార్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డిలను ఒప్పించి పక్కా ప్లాన్ తో వివేకాను అర్ధరాత్రి హత్య చేసినట్లు దస్తగిరి సిబిఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. దీంతో వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డితో పాటు, వివేకా దగ్గర పనిచేసిన సునీల్ కుమార్ యాదవ్ ను , ఉమాశంకర్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారించిన సీబీఐ అధికారులు వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.అదేసమయంలో దస్తగిరి తన వాంగ్మూలంలో తెలిపిన విషయాలన్నిపై ఆదారాల సేకరణ కోసం రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు పూర్తి ఆదారాలు సేకరించారు. అనంతరం శివశంకర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేసి కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో పులివేందుల కోర్టులో చార్జ్ సీట్ దాఖలు చేశారు. ముఖ్యంగా వివేకా హత్య కేసులో ఈ ఐదుగురు పాత్రతో పాటు వారు చంపడానికి ఎందుకు ఒప్పకున్నారన్న విషయాలను కూడా సీబీఐ తన చార్జిసీట్ లో సవివరంగా పేర్కొంది.
ఇదిలా ఉంటే హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి లతో పాటు అవినాష్ రెడ్డి బాబీ మనోహర్ రెడ్డిల ప్రమేయం కూడా ఉందన్న ప్రచారం మొదటి నుంచి బలంగా జరిగింది. అయితే హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి పాత్రను దృవీకరిస్తూ సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రధానంగా 2019 ఎన్నికల్లో కడప ఎంపీ సీటు విషయంలో అవినాష్ రెడ్డికి సీటు రాకుండా తనకు కానీ, విజయమ్మకు కానీ, షర్మిలకు గానీ సీటు ఇవ్వాలని వివేకానందరెడ్డి జగన్ కు చెప్పారని.. అప్పటి నుంచి అవినాష్ రెడ్డి, వివేకానందరెడ్డి పై కక్ష్య పెంచుకున్నారని ఆకారణంగానే అవినాష్ రెడ్డి తన తండ్రి , బాబాయి లతో కలిసి వివేకను హత్య చేయించి ఉండవచ్చని అనుమానిస్తున్నామని సీబీఐ చార్జ్ షీట్ లో పేర్కొంది.
అయితే సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో అవినాష్ రెడ్డి పేరు పొందుపరచడంతో అధికార పార్టీలో ఒక్కసారిగా కలకలం మొదలయ్యింది.దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులు ఎదురుదాడి మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా వివేకా హత్య వెనుక ఎంత కుట్ర దాగుందో, చార్జ్ షీట్ దాఖలులోనూ అదేవిధమైన కుట్ర కోణం దాగుంది అని.. ముందే అల్లుకున్న కధకు తగ్గట్లుగా అవాస్తవాలతో సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసిందని సజ్జల రామకృష్ణ రెడ్డి వ్యాఖ్యానించడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..అదేసమయంలో వివేకా గుండెపోటుతో చనిపోయారన్న విషయాన్ని అవినాష్ రెడ్డికి, ఆదినారాయణ రెడ్డికి చెప్పింది శివ ప్రకాష్ రెడ్డి అని.. ఆయన్ని వదిలేసి అవినాష్ రెడ్డి పై నిందలు వేయడం ఏమిటని సజ్జల ప్రశ్నించడం దేనికి సంకేతం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరొక అంశంగా వివేకా హత్య వల్ల వైఎస్ కుటుంబం, వైసీపీ కుటుంబం తీవ్రంగా నష్టపోయిందన్న ఆయన వివేకాకి తన కుమార్తె సునీతకి మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి, దానిపై సిబిఐ ఎందుకు విచారణ జరపలేదని అడగడం చూస్తుంటే వివేకా కుమార్తె సునీత రెడ్డి వైఎస్ కుటుంబంలోని వ్యక్తి కాదని పక్కన పెడుతున్నారనేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయనే భావన వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే హత్య కేసులో విచారణ వేగవంతం చేసిన దర్యాప్తు అధికారిని బదిలీ చేయించడానికి వైసీపీ ఏడాది కాలంగా విపరీతమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తోందని, సిబిఐ అధికారులే బాహాటంగా ఈ అంశాన్ని చర్చించుకుంటున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోందట. మరోపక్క వివేకా హత్య జరిగిన సమయంలో చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు కలిసి హత్య చేయించారు అంటూ వైసీపీ ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో ఎక్కడా చంద్రబాబు పేరు కానీ, టిడిపి నేతల పేర్లు కానీ కనీస ప్రస్తావనకు రాలేదు..అంటేకాకుండా రాజకీయ కుట్ర కోణంలో కుటుంబ సభ్యులైన అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలే హత్యకు కుట్ర పన్ని ఉండవచ్చన్న అనుమానాలు సిబిఐ వ్యక్తం అవుతున్న నేపధ్యంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న అవినాష్ రెడ్డితో తక్షణమే రాజీనామా చేయించాలన్న డిమాండ్ లు సైతం తెరపైకి వస్తున్నాయి..
మొత్తం మీద అనేక మలుపులు తిరుగుతూ , ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తున్న వివేకా హత్య కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ పెను దుమారం రేపుతోంది. అవినాస్ రెడ్డకి హత్యతో ప్రమేయం ఉందన్న ప్రచారం జోరందుకోగా.. సిబిఐ సైతం దీనికి సంబంధించిన ఆదారాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. ఇక పూర్తి స్థాయి ఆదారాలు లభించిన వెంటనే ఎంపీ అవినాస్ రెడ్డితో పాటు బాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలను కూడా అరెస్టు చేస్తారన్న వాదన జిల్లాతో పాటుగా రాష్ట్ర రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.