ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో హైదరాబాద్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార, విపక్ష పార్టీలు పోటీ పడి ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓట్లు రాబట్టుకోవడానికి ఎవరికి వారు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో లోపాయి కారి ఒప్పందం చేసుకుందని బీజేపీ ఆరోపిస్తోంది.. టీడీపీ , జనసేనలతో కలిసి బీజేపీ పోటీ చేస్తోందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎవరితోను పొత్తు ప్రస్తావనే రాలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, టీఆర్ఎస్‌ను ఎలా ఎదుర్కొవాలో తమకు తెలుసంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఎలా చావు దెబ్బ కొట్టామో అదే తరహాలో గ్రేటర్‌లోనూ అధికార పార్టీకి పరాభావం తప్పదంటున్నారు.
జనసేనతో పొత్తుపై క్లారిటీ లేదు..
తెలుగు రాష్ట్రాల్లో జనసేనకు కాస్తో కూస్తో కార్యకర్తల బలం ఉంది. గత ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసిన జనసేన తన అధినేతను కూడా గెలిపించుకోలేక పోయింది. ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. అయినా ఆ పార్టీకి ఓట్లు బాగానే వచ్చాయి. అయితే అభ్యర్థిని గెలిపించుకునే ఓట్లు జనసేనకు లేవని అర్థమైంది. ఇక తాజాగా, గ్రేటర్ ఎన్నికల్లోనూ జనసేన బరిలో దిగుతుందని చెబుతున్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. స్థానిక కేడర్ సూచన మేరకు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, బీజేపీ , జనసేన ఆంధ్ర ప్రదేశ్‌లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. తెలంగాణలోనూ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని గతంలో బండి సంజయ్ తెలిపారు. ఏకంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మరీ కలిసి వచ్చారు. ఆ తరువాత పెద్దగా ఈ రెండు పార్టీలు తెలంగాణలో కలవలేదు. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో వీరి పొత్తుపై చర్చలు జోరందుకున్నాయి. ఇరు పార్టీలు పొత్తుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒంటరిగానే పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి.
జనసేన పోటీ చేస్తే బీజేపీకే నష్టం..
గ్రేటర్‌లో జనసేన పోటీకి దిగితే బీజేపీకే నష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రెండు పార్టీల బలం యువతే కావడం ఇక్కడ ఇబ్బందికర అంశం. ఇరు పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చి జనసేనను పోటీ నుంచి తప్పించి అంతర్గతంగా సపోర్ట్ చేసుకుంటే తప్ప బీజేపీకి ఇబ్బందులు తప్పేలా లేవు. జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్‌కు సంబంధాలు ఉండటంతో ఆయనతో జాతీయ నాయకత్వం మాట్లాడి లేదంటే రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు జరిపి పోటీనుండి తప్పించేలా చేయాలంటున్నారు. ఒక వర్గానికి చెందిన ప్రజలు పవన్‌ను వ్యక్తిగతంగా ఇష్ట పడుతుంటారు. వీరు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నా ఓట్లు బీజేపీకి కాకుండా జనసేనకు వెస్తే అవి చీలిపోయి టీఆర్ఎస్‌కు లబ్ధిచేకూరే అవకాశం ఉందంటున్నారు. కొద్ది శాతం ఓట్లు కూడ గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో బీజేపీ వీలైనంత త్వరగా ఈ విషయంపై క్లారిటీ ఇస్తే ఆ పార్టీకి మేలు జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.