ఇన్‌సైడర్ ట్రేడింగ్… ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నోట నుంచి ఎక్కువ సార్లు వినిపించిన మాట. సీఎంగా పదవీ ప్రమాణం చేసిన వేదికపై నుంచే ఈ పదాన్ని పదే పదే ప్రయోగించిన జగన్… ఏపీ నూతన రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, దీనిని నిగ్గు తేలుస్తామని, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఆరోపణలపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవలే హైకోర్టు కొట్టేసింది. తాజాగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ పక్కా ఆధారాలతో ఓ వీడియో ఎంట్రీ ఇచ్చింది. పులివెందులకే చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి విడుదల చేసిన ఈ వీడియో వింటే… ఆయన చెబుతున్నట్లుగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ అమరావతిలో జరగలేదని, ముమ్మాటికీ పులివెందులలోనే ఏళ్ల తరబడి కొనసాగుతోందని నమ్మక తప్పదు. పులివెందులలో జరిగిన, జరుగుతున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో వైఎస్ కుటుంబానికి చెందిన చాలా మంది కోట్లు పోగేసుకోగా… ఇప్పుడు జగన్ అనుచరులుగా చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు మరోమారు ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆధారంగానే కోట్లు పోగేసుకునేందుకు రంగంలోకి దిగిపోయారని నమ్మక తప్పదు. ఆ కథాకమామీషు ఏమిటన్న విషయంలోకి వెళితే..
ఎప్పుడో 2018లో జరిగిన ఓ చిన్న గొడవ ఆధారంగా నమోదైన కేసును పట్టుకుని జనాల్లోనే తిరుగుతున్న బీటెక్ రవిని పరారీలో ఉన్న నిందితుడిగా ముద్ర వేసిన జగన్ సర్కారు ఇటీవలే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 14 రోజుల పాటు జైల్లో ఉండి వచ్చిన బీటెక్ రవి… ఆదివారం ఓ సంచలన వీడియోతో ఎంట్రీ ఇచ్చారు. పులివెందుల పరిసరాల్లో వైఎస్ ఫ్యామిలీ తమ భూములకు ఎలా రేట్లు పెంచుకుని సొమ్ము చేసుకుంటోందన్న విషయాన్ని సదరు వీడియోలో బీటెక్ రవి పూసగుచ్చినట్లుగా వివరించారు. అందులో భాగంగా ప్రస్తుతం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని రంగాపురంలో వైఎస్ఆర్ సీఎంగా ఉండగా… పలువురు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పులివెందుల రింగు రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ స్థలం విలువ ఎప్పటికైనా పెరగకపోతుందా? అన్న భావనతో లబ్ధిదారులు సొంత ఖర్చులతో తమకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. అందులో భాగంగా బేస్‌మెంట్ దాకా నిర్మాణాలు పూర్తి చేశారు.
Must Read ;- నో ఇన్ సైడర్ ట్రేడింగ్ : అమరావతి కేసుల్లో ఆ పదం వర్తించదు!
జగన్ సీఎం అయ్యాక… ఆయన అనుచరుడినని అని చెప్పుకుంటున్న కృష్ణ అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చేసి ఈ స్థలం ప్రభుత్వ భూమి కాదని, తమ బంధువులకు చెందినదని కొత్త వాదన వినిపించారు. దీనిపై కోర్టుకు సైతం వెళ్లిన సదరు వ్యక్తి తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారట. ఇంకేముంది… అప్పటకే సర్కారు ఇచ్చిన పట్టాలతో నిరభ్యంతరంగా బేస్‌మెంట్ల వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్థిదారులను ఆయన బెదిరించడం మొదలెట్టేశారట. కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వచ్చాయో తెలియదు గానీ… ఆ స్థలంలో లబ్ధిదారులు బేస్‌మెంట్ల దాకా నిర్మించుకున్న ఇళ్ల నిర్మాణాలను జేసీబీలతో ధ్వంసం చేయించారట. విషయం తెలుసుకున్న బీటెక్ రవి… మొత్తం వివరాలన్నింటినీ సేకరించి, లబ్ధిదారులకు నాటి వైఎస్ఆర్ సర్కారు జారీ చేసిన పట్టాలను, లబ్ధిదారులను పేర్లను, తాజాగా కృష్ణ అనే వ్యక్తి సదరు నిర్మాణాలను పగడొట్టిస్తున్న వైనాన్ని ఫొటోలు, వీడియోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా అక్కడ ప్రస్తుతం ఏం జరుగుతోంది? గతంలో ఏం జరిగింది? అన్న విషయాలను వివరిస్తూ వాటిని తన వీడియోను జత చేశారు.
ఈ వీడియోలో బీటెక్ రవి ఏం చెప్పారన్న విషయానికి వస్తే… వైఎస్ఆర్ హయాం నుంచే వైఎస్ కుటుంబీకులు పులివెందులలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారట. అందులో భాగంగానే… పులివెందుల నియోజవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కానుందని, అది ముద్దనూరు రోడ్డులో జేఎన్టీయూ సమీపంలో వస్తుందని ప్రచారం చేయించారట. మెడికల్ కాలేజీ వస్తుందని చెప్పిన ప్రాంతానికి ఆనుకుని ఉన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డికి చెందిన 20 ఎకరాల భూమిని రూ.1.2 కోట్లకు అమ్ముకున్నారట. అదే తరహాలో వైఎస్ మధు, ఆయన బావ, వైఎస్ భాస్కర్‌రెడ్డి పదుల సంఖ్యలో ఎకరాలను ఇలాగే తమ భూములన్న ప్రాంతానికి సమీపంలో ఏవేవో సంస్థలు వస్తున్నాయని ప్రచారం చేసుకుని అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారట. ఫలితంగా ఏమీ తెలియని పులివెందుల ప్రజలు భారీగా నష్టపోయారట. ఇన్‌సైడర్ ట్రేడింగ్ తో పులివెందులలోని తమ సొంత ఆస్తుల ధరలను పెంచేసుకుని లబ్ధి పొందిన జగన్ ఫ్యామిలీ.. చివరకు ఆ ఫ్యామిలీకే చెందిన వైఎస్ రాజశేఖరరెడ్డి మాటలను కూడా పట్టించుకోవడం లేదని బీటెక్ రవి ఆరోపించారు. వైఎస్ఆర్ ఇచ్చిన పట్టాలు జగన్ హయాంలో రద్దైపోతున్న వైనం ఇందుకు నిదర్శనమని కూడా బీటెక్ రవి చెప్పారు. మొత్తంగా జగన్ చెబుతున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్ అమరావతిలో జరగడం లేదని, అది జగన్ సొంతూరు పులివెందులలోనే జరగుతోందని బీటెక్ రవి అన్నారు. బీటెక్ రవికి చెందిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
Must Read ;- జగనన్న వదిలిన బాణమా? వదిలించుకున్న బాణమా?











