ఏపీలో పలు కేసుల్లో నిందితులను ఒకేరోజు అరెస్టు చేయడం ఆశ్చర్య కలిగిస్తోంది. నెలల తరబడి పురోగతి కనిపించని బెజవాడ దుర్గగుడి రథంపై వెండిసింహాల చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. వెంటనే పల్నాడులోని పెదగార్లపాడు మాజీ సర్పంచ్ అంకులు హత్య కేసు నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఇక గుడివాడ టు టౌన్ ఎస్.ఐ ఆత్మహత్య కేసులోనూ నిందితురాలిని అరెస్టు చేసి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇవన్నీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలసి వచ్చిన మరుసటి రోజే జరగడం కాకతాళీయమే అయినా, రాజకీయ విశ్లేషకులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అంకులు హత్య కేసులో ఆరుగురు అరెస్ట్
పల్నాడులో సంచలనం రేపిన పెదగార్లపాడు మాజీ సర్పంచ్ అంకులు హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ గుంటూరులో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో రాజకీయ ప్రమేయం లేదని ఎస్పీ చెప్పడం కొసమెరుపు. అధికారపార్టీ నేతలే ఈ హత్య చేయించారని బాధితుడి కుంటుబీకులు గగ్గోలు పెడుతుంటే ఈ కేసులో రాజకీయ ప్రమేయం లేదని పోలీసు అధికారులు మీడియాకు వెల్లడించారు. ఎవరో గుర్తుతెలియని సుపారీ గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ హత్య ఎవరు చేయించారనేది చాలా కీలకం. కేవలం హత్యకు పాల్పడిన వారిని అరెస్టు చేసి కేసు మూసి వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
Must Read ;- యరపతినేని ఫైర్ : అంకులు హత్య వెనుక ఎమ్మెల్యే కాసు
దుర్గగుడి వెండిసింహాల కేసులో పురోగతి
విజయవాడ దుర్గగుడి రథంపై ఉండాల్సిన మూడు వెండి సింహాలను లాక్ డౌన్ సమయంలో దుండగులు కాజేసిన సంగతి తెలిసిందే. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసులో పోలీసులు 8 నెలల కాలంగా ఎలాంటి పురోగతి సాధించలేదు. ఇక కేసు మూసేశారని అందరూ భావిస్తున్న సమయంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు పశ్నిస్తున్నారు. వెండిసింహాల కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. దేవాలయాల్లో గతంలో దొంగతనాలకు పాల్పడిన ఓ నిందితుడిపై వెండి సింహాల మాయం కేసు కూడా వేసి, ఈ కేసును మూసివేయాలని చూస్తున్నారని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆ సింహాల ప్రతిమలను కొనుగోలు చేసినట్లుగా భావిస్తున్న ఒక బంగారం వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
గుడివాడ ఎస్.ఐ ఆత్మహత్య కేసులో మహిళ అరెస్ట్
గుడివాడ టు టౌన్ ఎస్.ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో బ్యుటీషియన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 3 నెలల కిందటే వివాహం అయిన విజయ్ కుమార్ కు బ్యుటీషియన్ తో అక్రమ సంబంధం ఉందని, ఆమెతోనే అపార్టుమెంటులో నివాసం ఉంటున్నాడని తెలుస్తోంది. భార్యకు విడాకులు ఇచ్చి, తనను వివాహం చేసుకోవాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బ్యుటీషియన్ బెదిరించడం వల్లే, ఎస్.ఐ విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ కేసులో నిందితురాలుని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.
అమిత్ షాను కలసిన తరవాతే..
సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసిన తరువాతే పలు కేసుల్లో పురోగతి కనిపించడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేవాలయాలపై దాడులు, దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం, దేవాలయాల్లో దొంగతనాలపై కేంద్రం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. 145 దేవాలయాలపై దాడులు జరిగినా ఇంత వరకు నిందితులను పట్టుకోలేకపోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం జగన్మోహన్ రెడ్డికి క్లాసు పీకినట్టు తెలుస్తోంది. దీంతో ఏపీలో పోలీసులు ఉన్నపళంగా పని ప్రారంభించారనే పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి.
Must Read ;- విగ్రహాల ధ్వంసం కేసులు.. కేంద్రం ఏడాదిగా నిర్లక్ష్యం!