ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో బిజీగా వున్నాడు. హిందీలో ఘన విజయాన్ని సాధించిన ‘పింక్’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత రానున్న పవన్ సినిమా కావడంతో, ఆయన అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరువాత ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ అనే మలయాళ సినిమా రీమేక్ లో పవన్ నటించనున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఈ సినిమా అక్కడ వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
అలాంటి ఈ సినిమాను పవన్ తో రీమేక్ చేయడానికి దర్శకుడు సాగర్ కె. చంద్ర సన్నాహాలు చేసుకుంటున్నాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో ఈ దర్శకుడు అందరి దృష్టిలో పడ్డాడు. ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ కథను తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఆయన మార్పులు చేస్తున్నాడు. ఒరిజినల్ కథలో ఆర్మీ ఆఫీసర్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ .. పోలీస్ ఆఫీసర్ గా బిజూ మీనన్ నటించారు. ఆ సినిమాలో ఈ రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యతనిస్తూ నడిపించారు. కానీ తెలుగులో మాత్రం పవన్ పోషించనున్న పోలీస్ ఆఫీసర్ పాత్ర ప్రాధాన్యతను పెంచి, ఆర్మీ ఆఫీసర్ పాత్ర ప్రాధాన్యతను తగ్గించనున్నట్టు కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది.
తాజాగా ఈ విషయంపై తెలుగు రీమేక్ దర్శకుడు సాగర్ కె. చంద్ర స్పందించాడు. పవన్ పాత్ర ప్రాధాన్యతను పెంచి, మరో పాత్ర ప్రాధాన్యతను తగ్గించనున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. కథను బట్టే పాత్రలు నడుస్తాయనీ, ఆ సినిమాలోని రెండు పాత్రలను సమాంతరంగా నడిపించడం వల్లనే ఆ సినిమా అంతటి విజయాన్ని సాధించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దనీ, మూల కథ .. పాత్రల ఔచిత్యం దెబ్బతినకుండా తాను మార్పులు చేశానని అన్నాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అనే ఆసక్తితో తాను ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు.
Also Read ;- షూటింగ్ గ్యాప్‌లో పార్టీ సంగతి చూడనున్న పవన్ కల్యాణ్!
Also Read ;- మెట్రో ఎక్కే అవసరం పవన్ కల్యాణ్‌కు ఏంటి?











