క్రితం ఏడాది మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన చిత్రాల జాబితాలో ‘లూసీఫర్‘ ఒకటి. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, మోహన్ లాల్ ప్రధానమైన పాత్రను పోషించారు. కీలకమైన పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించగా, మంజూ వారియర్ ముఖ్యమైన పాత్రలో కనిపించింది. అత్యధిక వసూళ్లను సాధించడమే కాకుండా, వైవిధ్యభరితమైన చిత్రంగా ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. మోహన్ లాల్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో చేరిపోయింది.
ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం టాలీవుడ్ నుంచి చాలామంది నిర్మాతలు పోటీపడ్డారు. చివరిగా రీమేక్ హక్కులను చరణ్ సొంతం చేసుకున్నాడు. చిరంజీవి ప్రధానమైన పాత్రగా చరణ్ ఈ సినిమాను రీమేక్ చేయనున్నాడని చెప్పుకున్నారు. ‘సాహో’ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన ‘సుజీత్’ .. ‘లూసీఫర్’ రీమేక్ కి సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఈ ప్రాజెక్టు నుంచి సుజీత్ తప్పుకున్నాడనీ, వినాయక్ ఎంట్రీ ఇచ్చాడని చెప్పుకున్నారు. పెద్ద రచయితలతో వినాయక్ సిట్టింగ్ వేసినట్టుగా కూడా ప్రచారం జరిగింది.
కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి హరీశ్ శంకర్ పేరు తెరపైకి వచ్చింది. ఒరిజినల్ కథావస్తువు మూలం దెబ్బతినకుండా, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మార్పులు చేసి ఆవిష్కరించడంలో హరీశ్ శంకర్ సిద్ధహస్తుడు. ‘గబ్బర్ సింగ్’ .. ‘గద్దలకొండ గణేశ్’ రీమేక్ లు .. అవి సాధించిన విజయాలను అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అందువలన’సుజీత్ కి ‘లూసీఫర్’ రీమేక్ బాధ్యతలను అప్పగించాలని మెగా ఫ్యామిలీ భావిస్తున్నట్టుగా ఒక ప్రచారమైతే జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
AlsoRead ;- రీమేక్.. రీమేక్ నడుమ మెగాస్టార్..!!