మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు దగ్గరపడుతున్నాయి ఈ ఎన్నికలు గతంలో ఎంత రసవత్తరంగా జరిగాయో తెలిసిందే. మళ్లీ ఇప్పుడు జరగనున్న ఎన్నికలు కూడా చాలా ఆసక్తిగా సాగేలా కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈసారి మా ఎన్నికల్లో అధ్యక్షుడుగా పోటీ చేయాలి అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు.. ఆల్రెడీ ప్రచారం ఆరంభించేశారు. ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో మా ఎన్నికల్లో తను పోటీ చేయనున్న విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు. చిరంజీవి మద్దతు మీకు ఉంటుందని వార్తలు వస్తున్నాయి మీరేమంటారు అని అడిగితే.. చిరంజీవి అందరి వ్యక్తి. మంచి చేస్తారని భావించిన వారికి మద్దతు ఇస్తారు. అయితే… అన్నయ్యతో ఉన్న సాన్నిహిత్యాన్ని దీనికి ఉపయోగించుకోను అని చెప్పారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని.. తనకు అవకాశం ఇస్తే.. దేశంలోనే మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కు గౌరవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తాను అన్నారు. అలాగే మా కు సొంతం భవనం లేదు. తాను అధ్యక్షుడిని అయితే.. సొంతం భవనం నిర్మిస్తాను అని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈసారి మా ఎన్నికల్లో హీరో మంచు విష్ణు పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. చిరంజీవిని కలిసిన తర్వాత మంచు విష్ణు అనౌన్స్ చేయనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈసారి మా ఎన్నికలు కూడా రసవత్తరంగా జరిగేలా కనిపిస్తున్నాయి.
Must Read ;- సీసీసీ ఆధ్వర్యంలో తెలుగు సినీ కార్మికులకు వాక్సినేషన్