దానధర్మాలుగానీ, ఇతర సేవా కార్యక్రమాలు గానీ వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ఒకర్ని ఇంకొకరితో పోల్చడం కూడా సరికాదు. కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ కొందరు సినీ ప్రముఖుల్ని మనస్తాపానికి గురిచేస్తున్నాయి.
ప్రకృతి వైపరీత్యాలు లాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ఎప్పుడూ ముందు ఉంటూనే ఉంది. ఎన్టీయార్ ఏయన్నార్ టాప్ హీరోలుగా ఉన్న సమయంలో రాయలసీమ కరవు విషయంలోనూ, 1977లో దివి సీమ ఉప్పెన వల్ల సర్వం కోల్పోయిన వారి విషయంలోనూ ఈ అగ్రహీరోలు చొరవ తీసుకుని ముందుకొచ్చారు. తాము ఇవ్వగలిగినంత ఇవ్వడమే కాకుండా జోలె పట్టి మరీ డబ్బులు పోగేసి బాధితుల్ని ఆదుకున్నారు. కరోనా లాంటి మహా విపత్తు ఇంతవరకూ రాలేదు. ఇలాంటి సమయంలో తనలో సహజంగా ఉన్న గుణంత సోనూ జనానికి సాయం చేయడానికి ముందుకొచ్చారు.
నిజానికి ఆయన ప్రచారం కోసమో, రాజకీయం కోసమో ఇలా చేయలేదు. కానీ సోనూ ఇలాంటి చేస్తున్నప్పుడు మిగతావారు కూడా సోనూ లాగే చేయాలన్న నిబంధన ఎక్కడా లేదు. కానీ ఇతర నటులను సోనూ పోలుస్తూ కించ పర్చేలా ట్రోల్స్ చేయడంపై సినీ పరిశ్రమ పరంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సాయం చేయడం అనే విషయంలో ఎవరి పంథా వారిది. గోరంత సాయం చేసి కొండంత ప్రచారం చేసుకునే వారూ ఉన్నారు. కొండంత సాయం చేసినా గోరంత కూడా ప్రచారం చేసుకునే వారు కూడా ఉన్నారు.
సోనూ విషయంలో ఆయన ప్రత్యేకించి ప్రచారం చేయకపోయినా మీడియా స్వచ్ఛందంగా ఆయన చేపడుతున్న కార్యక్రమాలను వెలుగులోకి తెస్తోంది. దాని వల్ల కొందరికి ఇబ్బందికరంగానూ ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు తమదైన శైలిలో స్పందించి తాము చేయగలిగిన సాయం చేస్తూనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకుల తర్వాత ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంకులను స్థాపించి జనానికి తన వంతు చేయూతనిస్తున్నారు. తాము ఏం చేసినా వేరొకరితో పోల్చడం వల్ల మరి కొందరు ఇలాంటి సాయాలకు వెనుకంజ వేస్తున్నారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గత ఏడాది నుంచి అనేక సందర్బాల్లో స్పందించి సాయం చేశారు.
అలాగే కాదంబరి కిరణ్ మనం సైతం కార్యక్రమంతో అందరి మన్ననలూ అందుకుంటున్నారు. అంతా బాగానే ఉన్నా సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ మాత్రం సినీ ప్రముఖుల్ని మనస్తాపానికి గురిచేస్తున్నాయి. ఇటీవల శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. మెగాస్టార్ చిరంజీవి తన సొంత డబ్బులతో ఈ కార్యక్రమాలు చేపట్టడం లేదనేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. ఇలాంటి ట్రోల్స్ కు ధీటైన సమాధానం చెప్పాలని సినీ పరిశ్రమ నిర్ణయించుకున్నట్టుంది. మొన్నామధ్య ఓ కళ్యాణ్ మెగాస్టార్ కు బాసటగా నిలిచి వీడియో విడుదల చేశారు. ఈరోజు నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాథ్ స్పందించారు.
ఈ ట్రోల్స్ తమను బాధ పెడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాయం విషయంలో చిరంజీవిగారిని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదంటూ ఆయన విరుచుకు పడ్డారు. దర్శకుల దినోత్సవం రోజున ఆయనను అతిథిగా పిలిస్తే తన ఎదుగుదలకు దర్శకులే కారణమంటూ దర్శకుల సంఘం ఏర్పాటుచేసిన ట్రస్టుకు రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి మెగాస్టార్ పై పిచ్చిపిచ్చి కామెంట్లు పెడుతుంటే తట్టుకోలేక స్పందిస్తున్నట్లు తెలిపారు. వేరేవారితో సినీ హీరోలను పోల్చడం ఎంతమాత్రమూ సరికాదన్నారు. అందరూ సోనూ సూద్ లా చేయాలన్న రూలేం లేదన్నారు. ఇలా పోల్చడం సోనూ సూద్ కు కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి అని కాశీ విశ్వనాథ్ అన్నారు.
జబర్దస్త్ రైజింగ్ రాజు కూడా స్పందించి ఓ వీడియో బైట్ విడుదల చేశారు. మెగాస్టార్ గొప్పతనం ఎలాంటిదో వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వీరంతా మెగాస్టార్ కు మద్దతు పలుకుతూ ప్రకటనలు చేయడం. దానివల్ల మిగతా హీరోలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతోంది. చిరంజీవి ఒక్కరే చేస్తున్నారు మిగతావారు ఏమీ చేయడం లేదు అనే అంశం కూడా జనంలోకి వెళుతోంది. ఎవరు ఏం చేస్తున్నారనేది జనం గమనిస్తున్నారు కాబట్టి దీని మీద రాద్దాంతం చేయకుండా ఉంటేనే మంచిది. ఇలా ఎవరికి వారు వీడియోలు, ప్రకటనలు విడుదల చేయడం వల్ల ట్రోల్స్ మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది.
-హేమసుందర్
Must Read ;- కరోనా బాధిత `బ్లడ్ బ్రదర్స్` కుటుంబాలకు అండగా మెగాస్టార్