ప్రతి నాయకుడు ఎంత బలంగా ఉంటే కథానాయకుడు అంతగా ఎలివేట్ అవుతాడని ‘వకీల్ సాబ్’ మరోసారి నిరూపించింది. ఈ సినిమా విజయవంతమవడానికి ప్రధాన కారణం సెకండాఫ్ లో వచ్చే కోర్టు డ్రామానే. నిజానికి ఇక్కడ ప్రతి నాయకుడు ఎవరూ లేరు.
ఇద్దరు న్యాయవాదుల మధ్య జరిగే వాదన. ఆ ఇద్దరు న్యాయవాదుల్లో ఒకరు వకీల్ సాబ్ అనే పిలిచే సత్యదేవ్ పాత్రధారి పవన్ కళ్యాణ్ అయితే, ఇంకొకరు నందాగా పిలిచే లాయర్ నంద గోపాల్ పాత్రధారి ప్రకాష్ రాజ్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ‘బద్రి’ సినిమాలో ప్రకాష్ పోషించిన నందా పాత్ర ఎంత హైలైట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఆ పాత్ర వల్లే బద్రి పాత్ర ఎలివేట్ అయ్యింది. అదే చరిత్ర ఇప్పుడు పునరావృతమైంది.
‘నువ్వు నందా అయితే.. నేను బద్రి.. బద్రీనాధ్’ అంటూ పవన్ కళ్యాణ్ పలికిన డైలాగ్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో ఈ వకీల్ సాబ్ లో ప్రకాష్ రాజ్ ను ‘నందాజీ’ అంటూ పవన్ పలికే డైలాగులు కూడా అంతే పవర్ ఫుల్ గా ప్రేక్షకులకు వినిపించాయి. అసలు ఈ పాత్రకు ప్రకాష్ రాజ్ ను తీసుకోకపోయిఉంటే వకీల్ సాబ్ పాత్ర అంతగా ఎలివేట్ కాదనేది నగ్న సత్యం. శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా ఆ పాత్రలకు సరైన నటులు దొరక్కపోతే పండవనేది కూడా అంతే సత్యం. వకీల్ సాబ్ సినిమాకి ప్రధమార్థం ఎంత మైనస్ గా నిలిచిందో ప్రకాష్ రాజ్ పాత్ర ఎంటరైన తర్వాత ద్వీతీయార్థం అంత ప్లస్ గా మారింది.
ప్రకాష్ రాజ్ ఏమంటారు?
నందా పాత్రవల్ల బద్రి సినిమాను మరోసారి గుర్తు చేసిందని అంటున్నారు ప్రకాష్ రాజ్. ‘ఈ వకీల్ సాబ్ లో నా పాత్రకు నంద గోపాల్ అని పెట్టగానే ప్రేక్షకులు బద్రి టైమ్ కు వెళ్లి కనెక్ట్ అయిపోయారు. దర్శకుడు కావాలనే ఈ పేరు పెట్టారు. కథ చెప్పడం ఒక్కటే కాదు ప్రేక్షకులకు సరైన వినోదం అందినప్పుడు ఎంజాయ్ చేస్తారనడానికి ఇది ఓ ఉదాహరణ. నందాజీ.. నందగోపాల్ అని పవన్ గారు నన్ను పిలవగానే ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడి శ్రమ ఫలించింది.. నాకు కూడా ఎంతో సంతోషం కలిగించిన పాత్ర ఇది’ అని ప్రకాష్ రాజ్ అన్నారు. మీడియాతో తన అనుభవాలను ఆయన పంచుకున్నారు. నిజానికి ఇందులో ప్రకాష్ రాజ్ పాత్ర విలన్ కాదు. తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించే ఓ లాయర్. పైగా ఆ పాత్ర ఎంతో హుందాగా వ్యవహరిస్తుంది.
వకీల్ సాబ్ మీద దాడి చేసినప్పుడు తన క్లెయింట్ ను మందలించిన పాత్ర కూడా. అందువల్ల నందా ఓ పేరున్న లాయర్ అంతేగాని విలన్ కాదు. ‘ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంజాయ్ చేశానన్న ఫీలింగ్ వస్తే ఆ సినిమా సక్సెస్ అయినట్టే. కోర్టు డ్రామా పండటానికి దర్శకుడు చక్కటి ఎఫర్ట్ పెట్టారు. పవన్ గారి ఆలోచనకు దగ్గరగా ఉండే కథ ఇది. ఆయన పలికే డైలాగులు ఆయన మనసు నుంచే వచ్చినట్టు అనిపించాయి. సినిమాలో అన్నీ బాగున్నప్పుడే మా నటన కూడా ఎలివేట్ అవుతుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది’ అని ప్రకాష్ రాజ్ అన్నారు. పవన్ తో తనకు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన అభిప్రాయాలను తాను గౌరవిస్తానని అన్నారు.
ముందే చెప్పిన పవన్ కళ్యాణ్
ఈ సినిమాలో తన పాత్ర ఎలివేట్ అవడానికి కారణాన్ని పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు. వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుకలోనే ప్రకాష్ రాజ్ పాత్ర తన పాత్రను ఎంతగా ఎలివేట్ చేసిందో చెప్పారు. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు ఈ రెండు పాత్రల గురించే చర్చించుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ కు ధీటుగా మరోసారి పవన్ కళ్యాణ్ తన దైన శైలిలో ప్రేక్షకులను మెప్పించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
సాధారణంగా ఇలాంటి పాత్రల విషయంలో అంతకుముందు వచ్చిన సినిమాలోని పాత్రలతో కంపారిజన్ ఉంటుంది. పైగా అమితాబ్ పోషించిన పాత్రను వేరొకరు పోషించి మెప్పించడం అన్నది మామూలు విషయం కాదు. అలా ఫెయిలైన సినిమాలు చాలా ఉన్నాయి. ఈ పాత్రలను అంత బ్యాలెన్స్ డ్ గా దర్శకుడు తీర్చిదిద్దారు. వకీల్ సాబ్ విజయంలో సింహభాగం పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ లకే దక్కుతుంది.
– హేమసుందర్
Must Read ;- ‘వకీల్ సాబ్’ కు కలిసొచ్చింది.. కలెక్షన్లు నడిచొస్తాయా?











