అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిన దళిత కార్మిక హక్కుల ఉద్యమకారిణి నోదీప్ కౌర్ అరెస్టుకు సంబంధించి శుక్రవారం పంజాబ్-హర్యానా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత జనవరి 12న దేశ రాజధాని దిల్లీ శివారుల్లో కుండ్లీ ఇండస్ట్రియల్ ఏరియా (కేఐఏ)లో ఒక కంపెనీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన వారిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉద్యమకారిణి నోదీప్ కౌర్‌ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టు విషయంలో పోలీసులు నిబంధనలు అతిక్రమించారని, నోదీప్‌ను హింసించారని పలువురు ఉద్యమకారులు ఆరోపించారు. ఈ క్రమంలో హైకోర్టుకు ఫిబ్రవరి మొదటి వారంలో ఈమెయిల్ ఫిర్యాదు వచ్చింది. దీనిపై స్పందించిన హైకోర్టు సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదన విన్న న్యాయస్థానం నోదీప్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.
అంతర్జాతీయంగా..
ఈ కేసుకు సంబంధించి కొన్నాళ్ల క్రితం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ ఒక ట్వీట్ చేశారు. నెల రోజులకు పైగా జైలులో ఉన్న 25 ఏళ్ల భారత కార్మిక హక్కుల కార్యకర్త నోదీప్ కౌర్‌ను విడుదల చేయాలని ఆ ట్వీట్‌లో కోరారు. #ReleaseNodeepKaur అనే హ్యాష్ ట్యాగ్‌తో మీనా హారిస్ ట్వీట్ చేశారు. అంతకు ముందే బ్రిటన్ పార్లమెంటులో సైతం లేబర్ పార్టీ ఎంపీ తన్మన్‌జీత్ సింగ్ దేశి కూడా నోదీప్ అరెస్టు విషయాన్ని ప్రస్తావించారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో నోదీప్ కౌర్ అరెస్టు వ్యవహారంపై చర్చ నడిచింది. నోదీప్ అరెస్టును నిరసిస్తూ పంజాబ్ రాష్ట్రంలో రైతు సంఘాల నాయకులు, విద్యార్థి నేతలు సంఘీభావం తెలిపారు.
Must Read ;- ప్రభుత్వంతో విభేదించడం.. దేశద్రోహమెలా అవుతుంది..!
సంచలన ఆరోపణలు..
కార్మికుల వేతనాల బకాయిలు, హక్కుల కోసం మజ్దూర్ అధికార్ సంఘటన్ (MAS) కార్మిక సంఘం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమించిన తమ చెల్లెల్ని బూటుకాళ్లతో తన్నారని, అభ్యంతరంగా వ్యవహరించారని నోదీప్ కౌర్ అక్క రాజ్ వీర్ కౌర్ ఆరోపించడం సంచలనం రేపింది. దీంతో హైకోర్టు నోదీప్ కౌర్ ఆరోగ్య పరిస్థితిపై నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో పోలీసులపై హత్యాయత్నం, పోలీసుల ఆయుధాలు దొంగిలించే యత్నం, పోలీసుపై దాడికి ఉసిగొల్పలా పిలుపు ఇవ్వడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం లాంటి కేసులు ఆమెపై నమోదయ్యాయి.
డిసెంబరు నుంచి ఘర్షణ..
కాగా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యంతో కార్మికులు పలుమార్లు ఘర్షణకు దిగాల్సి వచ్చింది. గత డిసెంబరులో ఫ్యాక్టరీ భద్రతా విభాగానికి, కార్మికులకు మధ్య రెండు సార్లు ఘర్షణ జరగడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులపైనా కార్మిక సంఘాలు ఆరోపణలు దిగాయి. ఆందోళన చేపట్టాయి. ఆ ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆ క్రమంలో నోదీప్ కార్మికులను రెచ్చగొట్టారని, పోలీసులపైనే దాడి చేశారని, ఏడుగురు పోలీసులు గాయపడడానికి నోదీప్ కారణమని కేసు నమోదైంది. అంతకుముందే ఈ కార్మిక సంఘం కూడా ధిల్లీ శివార్లలో రైతులు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపింది. ఆ ఆందోళనల్లో పాల్గొన్న కారణంగా నోదీప్ కౌర్ ఉద్యోగాన్ని కోల్పోయారన్న చర్చకూడా నడిచింది.
రెండు రాష్ట్రాల మధ్య వివాదం
కాగా నోదీప్ కౌర్ అరెస్టు అంశం రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. పంజాబ్‌కు చెందిన నోదీప్ కౌర్ ఇప్పటికే రైతుల ధీక్షకు మద్దతు ప్రకటించారు. కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నారు. అందు కోసమే ధిల్లీ పోలీసుల ద్వారా కేంద్ర ప్రభుత్వం నోదీప్ కౌర్‌ను అరెస్టు చేసిందని పంజాబ్ ప్రభుత్వం (కాంగ్రెస్ ) ఆరోపించింది. నిబంధనలకు విరుద్ధంగా హర్యానా పోలీసుల కస్టడీలో ఉంచిందని ఆరోపించింది. అయితే నోదీప్ కౌర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంతోనే అరెస్టు జరిగిందని హర్యానా (బీజేపీ) ప్రభుత్వం వ్యాఖ్యానించింది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్నాళ్ల పాటు మాటల యుద్ధం నడిచింది. నోదీప్ కౌర్‌కు న్యాయ సహాయం అందిస్తామని పంజాబ్ ప్రభుత్వం గతంలో ప్రకటించింది.