ప్రియా ప్రకాశ్ వారియర్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె తాజా చిత్రంగా ‘ఇష్క్‘ రూపొందింది. ఇది ఓ మలయాళ సినిమాకి రీమేక్. ఈ సినిమాతో ఎస్.ఎస్.రాజు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రేమకథగా మొదలైన ఈ సినిమా, రొమాంటిక్ థ్రిల్లర్ ను గుర్తుచేస్తూ సాగుతుంది. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 30వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి ప్రియా ప్రకాశ్ వారియర్ మాట్లాడింది.
దర్శకుడు రాజు ఈ సినిమా కోసం నన్ను కలిసినప్పుడు, ఇది మలయాళంలో ఒక సినిమాకి రీమేక్ అని చెప్పారు. దాంతో నేను ఆ సినిమా చూశాను. ఆ వెంటనే ఆయనకి ఓకే చెప్పాను. అంతగా ఆ కథ .. పాత్ర నన్ను ఆకట్టుకున్నాయి. ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా నేను చాలా త్వరగా ఓకే చేసిన సినిమా ఇది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనీ, నా పాత్రకు మంచి పేరు వస్తుందని భావిస్తున్నాను. దర్శకుడు రాజు నాకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడం .. తెలుగు భాష విషయంలో తేజ సజ్జా నాకు బాగా హెల్ప్ చేయడం వలన నేను ఈ పాత్రను బాగా చేయగలిగాను.
తెలుగు మాట్లాడితే నాకు అర్థమవుతుంది. నేను మాట్లాడాలంటే కొంచెం కష్టమవుతోంది. మరో రెండుమూడు తెలుగు సినిమాలు చేస్తే దార్లోపడిపోతాను. తెలుగులో మరో సినిమా కూడా చేస్తున్నాను. హిందీలో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక మలయాళంలో మంచి సబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. బయట కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు .. ఇంట్లోనే ఉండవలసి వచ్చినప్పుడు నేను చాలా టెన్షన్ పడిపోయాను. హీరోయిన్ గా నిలదొక్కుకోవలసిన సమయంలో ఇంటి పట్టునే ఉండిపోవలసి వచ్చింది. ఈ గ్యాపులో అందరూ నన్ను మరిచిపోతారేమోనని అనిపించింది” అని చెప్పుకొచ్చింది.
Must Read ;- అందం, అభినయంతో అగ్రపీఠంపై మలయాళ కుట్టి











