AP High Court Comments On Mansas Trust Issue :
జగన్ సర్కారుకు కోర్టుల్లో దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. న్యాయపరమైన విషయాలేమీ పట్టించుకోకుండా.. అనుకున్నట్టుగా చేసుకుపోతున్న జగన్ సర్కారు కోర్టు బోనులో దోషిగా నిలబడుతోంది. ఇప్పటికే చాలా కీలక నిర్ణయాల్లో కోర్టుల నుంచి అక్షింతలు వేయించుకున్న జగన్ సర్కారు.. తాజాగా అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన పిటిషన్ పైనా హైకోర్టులో జగన్ సర్కారుకు మొట్టికాయలు పడ్డాయి. మాన్సాస్ చైర్మన్ హోదాలో అశోక్ జారీ చేసే ఆదేశాలు అమలు చేయాల్సిందేనని, ఈ వ్యవహారంలో అశోక్ మాటను జగన్ సర్కారు వినాల్సిందేనని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
ఈవో ప్రొసీడింగ్స్ రద్దు
ఇటీవల మాన్సాస్ విద్యాసంస్థల సిబ్బంది మాన్సాస్ ట్రస్టు (Mansas Trust) ఈవో కార్యాలయాన్ని ముట్టడించడం తెలిసిందే.16 నెలలుగా సరిగా జీతాలు చెల్లించడంలేదని వారు ఈవోపై ధ్వజమెత్తారు. అటు, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజు కూడా ఈవో వెంకటేశ్వరరావుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవో తన మాట వినడంలేదని ఆరోపించారు. ఇదే విషయంపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అశోక్ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈవో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రస్టు చైర్మన్ ఆదేశాలను ఎందుకు పాటించరు? అని ప్రశ్నించింది. అసలు, ట్రస్టు వ్యవహారాల్లో ఈవో పాత్ర ఏమిటని వివరణ కోరింది. ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజు ఇచ్చే ఆదేశాలను ఈవో గౌరవించాల్సిందేనని స్పష్టం చేసింది. ట్రస్టు సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా, ట్రస్టు అకౌంట్లు సీజ్ చేయాలని, పాలకమండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను సస్పెండ్ చేసింది.
ఇష్టారాజ్యంగా ఆడిట్ కుదరదు
అంతటితో ఆగని కోర్టు.. ట్రస్టు కార్యకలాపాలపై ఇష్టారాజ్యంగా ఆడిట్ నిర్వహించడం కుదరదని కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. సరైన హోదా కలిగిన ఆడిట్ అధికారితో మాత్రమే ఆడిట్ చేయించాలని, ఇతరుల ప్రమేయం ఉండరాదని హైకోర్టు తెలిపింది. స్టేట్, లేదా డిస్ట్రిక్స్ ఆడిట్ ఆఫీసర్ మాత్రమే మాన్సాస్ ట్రస్టులో ఆడిట్ నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఆపై, తదుపరి విచారణను వాయిదా వేసింది. మొత్తంగా మాన్సాస్ ట్రస్టుపై తమ పట్టును నిలుపుకునే దిశగా జగన్ సర్కారు వేస్తున్న ఎత్తులను అశోక్ నిలువరించే యత్నంలో భాగంగా ఇప్పటికే చాలా మేర విజయం సాధించగా.. ఇప్పుడు అశోక్ ను అవమానపరిచేలా వ్యవహరించిన జగన్ సర్కారుకు కోర్టులో మొట్టికాయలు పడిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.
Must Read ;- సీబీఐ మారదు.. జగన్‌కు టెన్షన్ తప్పదు