వారంలో మారిన పుదుచ్చేరి గేమ్ – సీఎం నారాయణస్వామి పదవికి రాజీనామా చేశారు. తమ పార్టీ గెలవడం ఎంత ముఖ్యమో..ప్రత్యర్థికి ఏ కోణంలోనూ అవకాశం దక్కకుండా చేయడం కూడా రాజకీయాల్లో అంతే ముఖ్యం. ఇది సాధారణంగా జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చేసేందుకు కూడా వెనుకాడని పరిస్థితి సాధారణంగా మారింది. అందులోనూ బీజేపీ ఈ అపప్రద ఎక్కువగా మూటగట్టుకుంటోంది. కర్ణాటకలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ రాజస్థాన్‌లో అందుకు విఫలయత్నం చేసిందన్న విమర్శలున్నాయి. తాజాగా పుదుశ్చేరిలోనూ ప్రభుత్వం కూలిపోయింది. ప్రత్యక్షంగా బీజేపీ పాత్ర లేకున్నా.. అటు లెఫ్టినెంట్ గవర్నర్ బదిలీ, వెంటనే ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేయడం గంటల వ్యవధిలో జరిగాయి. నెలరోజుల నుంచి నెలకొన్న రాజకీయ సంక్షోభం..ప్రభుత్వం కూలిపోవడంతో ముగిసింది. బలనిరూపణకు ముందే సీఎం నారాయణస్వామి తన రాజీనామాను ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైకి సమర్పించారు.
కాంగ్రెస్, డీఎంకే సభ్యుల రాజీనామాతో బలపరీక్ష
పుదుచ్చేరి శాసనసభలో కాంగ్రెస్, డీఎంకే కూటమి ప్రభుత్వం నడుస్తోంది. కాంగ్రెస్ సభ్యులు తొలుత 15 మంది ఉండగా వారిలో ఏడుగురు రాజీనామా చేశారు. డీఎంకే సభ్యులు ముగ్గురు, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో పాటు కొందరు ఎన్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులతో ప్రభుత్వం నడిచింది. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యుడు, డీఎంకే సభ్యుడు రాజీనామా చేయడంతో బలపరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే సభలో అన్నాడీఎంకే 4, నామినేటెడ్ బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు సభ్యులు ఉండగా ఎన్‌ఆర్ కాంగ్రెస్‌కు ఏడుగురు సభ్యులున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బలనిరూపణకు సిద్ధం కావాల్సి వచ్చింది. అనర్హత వేటు పడిన సభ్యులను మినహాయిస్తే మెజార్టీ నిరూపణకు కావాల్సిన బలం 14. అయితే ఆ మేరకు అధికార పక్షానికి బలం లేకపోయింది. దీంతో బలనిరూపణకు ముందే నారాయణస్వామి రాజీనామా చేశారు. కాగా ఈ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్నా డిఎంకే-బీజేపీ కూటమి అధికార పగ్గాలు చేపడుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ క్రమంలో గవర్నర్ ముందు మూడు మార్గాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏడుగురు ఎమ్మెల్యేలతో పెద్ద పార్టీగా ఉన్న ఎన్.ఆర్. కాంగ్రెస్ కూటమి (AIADMK,BJP లతో) ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడితే అవకాశం ఇవచ్చు. అయితే రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం అవుతుందనేది కూడా పార్టీలకు ప్రధానమైన అంశంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరూ రాని పక్షంలో రాష్ట్రపతి పాలన విధించడం లేదా ఎన్నికలు అయ్యేవరకు సుప్తచేతనావస్థలో ఉంచడం వంటి అంశాలున్నాయి.
Must Read ;- పుదుచ్చేరిలో కూలిన కాంగ్రెస్ సర్కార్..
వారంలో మారిన పుదుచ్చేరి గేమ్..
వాస్తవానికి పుదుశ్చేరిలో ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి మొదటి నుంచి గ్యాప్ ఉంది. ధిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా గతంలో బరిలోకి దిగి ఓడిపోయిన మాజీ మొట్టమొదటి మహిళా ఐపీఎస్ కిరణ్ బేడీని.. కేంద్రం 2016లో పుదుశ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించింది…అక్కడ సీఎం నారాయణ స్వామికి, కిరణ్ బేడీకి మధ్య వివాదాలు పెరిగాయి. ఇప్పటికే అధికారపక్షం గవర్నర్‌పై చాలా విమర్శలు చేసింది. ప్రభుత్వ కార్యకలాపాల్లో కిరణ్ బేడీ జోక్యం ఎక్కువైందని, మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని, ఆమెను తొలగించాలనే డిమాండ్‌తో సీఎం నారాయణ స్వామి దీక్షకు దిగారు. వారం క్రితం రాష్ట్రపతిని కలిసి ఇదే విషయాన్ని విన్నవించారు. కొన్నాళ్ల క్రితం లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో కిరణ్ బేడీ చేసిన వ్యాఖ్యలు, జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. హెల్మెట్ నిబంధన అతిక్రమించిన వారి వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. అయితే విడతల వారీగా అమలు చేయాలని ప్రభుత్వం విన్నవించినా.. వెనక్కి తగ్గలేదు.
రాహుల్ గాంధీ టూర్‌కి ముందే..
అప్పటికే కాంగ్రెస్‌కు, కిరణ్ బేడీకి మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కిరణ్ బేడీపై విరుచుకుపడింది. ఆ అంశంపై రాహుల్ గాంధీ పుదుచ్చేరి టూర్‌కి కూడా ప్రణాళిక వేసుకున్నారు. అయితే, అందుకు ఒక్కరోజు ముందే రాత్రికి రాత్రి కిరణ్ బేడీని తప్పించింది కేంద్రం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉలిక్కిపడింది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు, డీఎంకే ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేశారు. తమ ఎమ్మెల్యే రాజీనామా చేయడం ఒక్కసారిగా కాంగ్రెస్‌ను అయోమయంలో పడేసింది. ప్రభుత్వం మైనార్టీలో పడింది. కిరణ్ బేడీ స్థానంలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందర రాజన్..బలనిరూపణకు ఆదేశించారు. ఆ బలం లేకపోవడంతో సీఎం రాజీనామా చేశారు. కాంగ్రెస్ చేతికి ఆయుధం దొరకకుండా.. కాంగ్రెస్‌ను దెబ్బతీయడం, ప్రభుత్వాన్ని కూల్చే వ్యూహాన్ని బీజేపీ అమలు చేసిందని చెప్పవచ్చు. అంతేకాదు..రానున్న ఎన్నికల్లో పరిస్థితులను బట్టి.. తమ వ్యూహాలను అమలు చేసే విధంగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు నిర్దేశం చేసే అవకాశాన్ని కూడా బీజేపీ అట్టిపెట్టుకుంది.
Also Read ;- మారని టీ కాంగ్రెస్ తీరు.. ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ పదును