లారెన్స్ దర్శకనిర్మాతగా .. ఆయనే కథానాయకుడిగా కొంతకాలం క్రితం వచ్చిన ‘కాంచన‘ సంచలన విజయాన్ని సాధించింది. బలమైన కథాకథనాలతో .. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టేసింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమైన ప్రతిసారి మంచి రేటింగును రాబడుతూ ఉండటం విశేషం. ఈ సినిమాలో లారెన్స్ నటన ఒక ఎత్తయితే, ట్రాన్స్ జెండర్ గా శరత్ కుమార్ నటన ఒక ఎత్తు. ఇద్దరూ కూడా ఎవరి పాత్రలో వాళ్లు పోటీపడి నటించారు.
అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోంది .. ఆ సినిమా పేరే ‘రుద్రన్’. లారెన్స్ గత చిత్రాల మాదిరిగా ఇది కూడా హారర్ మూవీనే. అయితే ఈ సినిమాకి ఈ సారి లారెన్స్ దర్శక నిర్మాతగా వ్యవహరించడం లేదు. కథిరేసన్ అనే నిర్మాత ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘కాంచన’ సినిమాలో మాదిరిగానే లారెన్స్ కథానాయకుడిగా నటిస్తుండగా, కీలకమైన పాత్రలో శరత్ కుమార్ కనిపించనున్నారు. లారెన్స్ సరసన ప్రియాభవానీ శంకర్ కథానాయికగా అలరించనుంది.
జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు జరుపుకుంటోంది. లారెన్స్ నుంచి హారర్ మూవీ రాక చాలా కాలమైంది. లారెన్స్ నుంచి ఆ తరహా సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ‘రుద్రన్’ను ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నారు. ఆ దిశగా చకచకా పనులు జరుగుతున్నాయి. కనుక లారెన్స్ నుంచి మాంఛి హారర్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ముచ్చట, ఈ ఏడాదిలోనే తీరనుంది.
Must Read ;- నేను ట్రాన్స్ జెండర్‌ని అయితే ఏంటి?











