ఈ మెగా అనుబంధం కథేంటి అనుకుంటున్నారా? ఈ ముగ్గురూ కలిసి నటించి 30 ఏళ్లు అయ్యింది. దాదాపు 30 ఏళ్ల క్రితం విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మురళీ మోహన్, శరత్ కుమార్ కలిసి నటించారు. ఆ సినిమాలో రాజారాంగా చిరంజీవి నటిస్తే, రఘుపతిగా మురళీమోహన్, రాఘవగా శరత్ కుమార్ నటించారు. అందులో వీరు ముగ్గురూ అన్నదమ్ములుగా నటించారు. 30 ఏళ్ల తర్వాత వీరు ముగ్గురూ కలుసుకునే అపూర్వ అవకాశం లభించింది. ఈ కలయికకు శనివారం నాడు రామోజీ ఫిలిం సిటీ వేదికైంది.

అక్కడ ‘ఆచార్య’ షూటింగ్ లో మెగాస్టార్ ఉన్నారు. అదే సమయంలో మరో చిత్రాల షూటింగులు కూడా జరుగుతున్నాయి. అర్కా మీడియా షూటింగ్ లో మురళీ మోహన్, మణిరత్నం దర్శకత్వంలోని షూటింగ్ లో శరత్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. చిరంజీవి అక్కడే ఉన్నారని తెలిసి మురళీ మోహన్, శరత్ కుమార్ ఆచార్య సెట్ లోకి వెళ్లి మెగాస్టార్ ను కలిశారు. అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు. దాంతో ఇలా ఫొటో దిగి తన మధురానుభూతిని పంచుకున్నారు. 30 ఏళ్ల ‘మెగా శరత్ మురళీ’ రవం ఇది.
శరత్ కుమార్ తో స్నేహబంధం
ఈ ముగ్గురు ఫొటో మరెన్నో విశేషాలను కూడా గుర్తు చేస్తోంది. శరత్ కుమార్ ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమకు వెళ్లి హీరోగా ఎదిగారు. మురళీ మోహన్ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో తనకంటూ ప్రత్యేకతను నిరూపించుకున్నారు. అవన్నీ పక్కన పెడితే హీరో శరత్ కుమార్ కూ, మెగాస్టార్ చిరంజీవికీ మధ్య మంచి స్నేహబంధాన్ని కూడా ఏర్పరచింది. ఈ విషయాన్ని శరత్ కుమార్ కూడా ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. ఓసారి శరత్ కుమార్ అప్పుల్లో కూరుకుపోయాడట.
Also Read ;- మెగాస్టార్ మూవీకి ముహూర్తం ఖాయమైందా?

అదే సమయంలో ఓ సినిమాకి సహనిర్మాతగా వ్యవహరించే అవకాశం కూడా వచ్చింది. ఆ సినిమాని చిరంజీవితో చేయాలనుకున్నారు. వెంటనే చిరంజీవికి ఫోన్ చేసి మాట్లాడాలని అడిగారట. ఫోన్ లో చెప్పమంటే పర్సనల్ గానే కలిసి చెబుతానని శరత్ కుమార్ అన్నారట. ఇంటికి రమ్మని చిరంజీవి ఆహ్వానించారట. శరత్ కుమార్ వెళ్లిన సమయంలో చిరంజీవి ఓ సినిమా ఫైట్ సన్నివేశం కోసం షూటింగ్ లో ఉన్నారు.
అక్కడికే వెళ్లారు శరత్ కుమార్. వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసి శరత్ ను ఇంటికి తీసుకువెళ్లారు. భోజనం చేశాక ‘ఏంట్రా చెప్పు?’ అనడిగారట. విషయం చెప్పారు శరత్ కుమార్. రెమ్యూనరేషన్ ఎంత అని అడిగితే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు రెమ్యూనరేషన్ ఎందుకురా.. వద్దు అన్నారట. ఈ ముగ్గురి కలయిక సందర్భంగా తారల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో కూడా తెలుస్తోంది కదూ.
Must Read ;- నిన్న స్టైలిష్ స్టార్ నేడు మెగాస్టార్, మెగా పవర్ స్టార్











