పురాణ కథలకు కాలం చెల్లిందనుకుంటే మళ్లీ అలాంటి కథలకు పూర్వ వైభవం వస్తుందేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే ఎలాంటి గ్రాఫిక్స్ లేని సమయంలో ఎన్నో పురాణ కథలు సినిమాలుగా రూపొంది ఘనవిజయం సాధించాయి. ప్రస్తుత విజువల్ ఎఫెక్ట్స్ కాలంలో మళ్లీ అలాంటి కథలను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదిపురుష్’ చిత్రం. ఇప్పుడు ఇలాంటి చిత్రాలకు తెరకెక్కించడం సులభం కూడా. రాజమౌళి ‘బాహుబలి’లాంటి చారిత్రక ప్రయోగాంచేసి తానేమిటో ప్రూవ్ చేసుకున్నారు.
దాదాపు 2000 కోట్ల రూపాయలు వసూలు చేయగలిగే సినిమాగా ప్రూవ్ చేసుకోగలిగారు. దాంతో పాటు మహాభారతం చేస్తానని ఆయన ఎప్పటినుంచో చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ పూర్తికాగానే ఆయన ఏంచేస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఉంటుందన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్. నారాయణకు రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది కూడా. మహేష్ బాబుతో చేయబోయే సినిమా అది అవుతుందా అన్న చర్చలు నడుస్తున్నాయి.
Must Read ;- ఆదిపురుష్ కు ఆదిలోనే హంసపాదు
ఈసారి రాజమౌళి పురాణ కథ వైపే మొగ్గు చూపుతారన్న మాట కూడా వినిపిస్తోంది. అయితే తాజా వార్త ఏమిటంటే రాజమౌళి కూడా రామాయణం వైపే దృష్టి సారించాడని అంటున్నారు. మహేష్ బాబును శ్రీరాముడిగా, హృతిక్ రోషన్ ను రావణాసురుడిగా రామాయణాన్ని తెరకెక్కించబోతున్నారని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో సీతగా దీపికా పదుకొణే నటిస్తుందట. సాధారణంగా రాజమౌళితో సినిమా చేయాలంటే ఒక్క నిర్మాత సరిపోరు. తెరమీద నిర్మాతగా ఒక్క పేరే కనిపించినా తెరవెనుక నిర్మాతలు చాలామందే ఉంటారు. పైగా రామాయణం లాంటి ప్రాజెక్టును తెరకెక్కించాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే.
ఓ ప్రముఖ నిర్మాత రూ. 300 కోట్లు ఖర్చు చేయడానికి ముందుకు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కూడా పూర్తి కావచ్చింది. పోస్టు ప్రొడక్షన్ పూర్తయితే కొత్త సినిమా పనుల్లో రాజమౌళి మునిగిపోవాల్సిందే. పైగా రాజమౌళి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా కొత్త సినిమాలు కమిట్ అయిపోయారు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగులో ఉన్నారు. వచ్చే సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రాజమౌళితో మహేష్ సినిమా చేసే అవకాశం ఉంది. హీరోలందరికీ చేతిలో సినిమాలు నిండుగా ఉన్నాయి. బహుశా రాజమౌళి సినిమాకి డేట్స్ ఇచ్చినందువల్లే మహేష్ గుంభనంగా వ్యవహరిస్తున్నాడేమో. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాజమౌళితో సినిమా అంటే మహేష్ బాబు దాదాపు రెండేళ్లు వేరే సినిమా చేసే అవకాశం కూడా ఉండదు. చూడాలి ఏం జరుగుతుందో.
Also Read ;- దుబాయ్ లో ‘నాంది’పలికిన సూపర్ స్టార్ మహేష్