మొదటి నుంచి కూడా శర్వానంద్ ఎక్కడా తొందరపాటు లేకుండా, నిదానమే ప్రదానం అనే తరహాలోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కథాకథనాలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘శ్రీకారం’ సిద్ధమవుతోంది. బి.కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శర్వానంద్ సరసన నాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ అలరించనుంది. మహా శివరాత్రి కానుకగా ఈ సినిమాను మార్చి 11వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు.
రామ్ ఆచంట – గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. శర్వానంద్ ఈ సినిమాలో రైతు పాత్రలో కనిపించనున్నాడు. రైతుగా ఆయన ఎదుర్కునే సమస్యలు .. వాటిని అధిగమించడానికి ఆయన అనుసరించిన మార్గాల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. నిన్న సాయంత్రం మహేశ్ బాబు చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. టీజర్ చాలా బాగా ఉందనీ, సినిమా తప్పకుండా సక్సెస్ కావాలని ఆశిస్తున్నానంటూ టీమ్ ను మహేశ్ బాబు అభినందించారు. అలా బయటికి వచ్చిన టీజర్ ఇప్పుడు ఒక రేంజ్ లో దుమ్మురేపేస్తోంది. శర్వానంద్ డైలాగ్ పై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. బుర్ర సాయిమాధవ్ రాసిన ఓ డైలాగ్ ఆలోచింపజేస్తోంది.
“ఒక హీరో తన కొడుకును హీరోను చేస్తున్నాడు .. ఒక డాక్టర్ తన కొడుకుని డాక్టర్ ను చేస్తున్నాడు .. ఒక ఇంజనీర్ తన కొడుకును ఇంజనీర్ ను చేస్తున్నాడు .. కానీ ఒక రైతు మాత్రం తన కొడుకును రైతును చేయడం లేదు. తినేవాళ్లు నెత్తిమీద జుట్టంత ఉన్నారు .. కానీ పండించేవాళ్లు మూతిమీద మీసమంత లేరు” అనే డైలాగ్ హార్ట్ టచింగ్ గా ఉంది. యువరాజ్ సినిమాటో గ్రఫీ .. మిక్కీజె. మేయర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఆమని .. రావు రమేశ్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.
Must Read ;-‘మహా సముద్రం’ విడుదల తేదీ ఖరారు











