తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ‘రాక్షసుడు’ ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తుంది. కరోనా కాలు పెట్టడానికి ముందు వచ్చిన ఈ సినిమా, హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన జోడీగా అనుపమ పరమేశ్వరన్ కనిపించింది. ఒక సైకో ఆడపిలల్లపై ద్వేషం పెంచుకుని, వాళ్లని వరుసగా చంపేస్తూ వెళ్లే ఈ కథ, అనుక్షణం ఆసక్తికరంగా సాగుతుంది. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా, దర్శకుడిగా రమేశ్ వర్మకు మంచి పేరును తెచ్చిపెట్టింది.
రెండేళ్ల క్రితం ఇదే రోజున ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా రెండేళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా,నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడారు. ‘రాక్షసుడు‘ సినిమా కథాకథనాలు ప్ర్రేక్షకులకు బాగా నచ్చాయి. అందువల్లనే తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠను పెంచడంలో దర్శకుడు రమేశ్ వర్మ సక్సెస్ అయ్యాడు. అందువలన ఆయనతోనే సీక్వెల్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాము. ఇటీవలే ఆ ఆలోచన కార్యరూపాన్ని దాల్చింది. ఈ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.
‘రాక్షసుడు 2’ పేరుతో ఈ సినిమాను నిర్మిస్తున్నాము. కమర్షియల్ గా మరిన్ని హంగులను జోడిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నాము. హాలీవుడ్ లో థ్రిల్లర్ సినిమాలు ఎలాంటి అనుభూతిని కలిగిస్తాయో, ఈ సినిమా కూడా అదే విధమైన అనుభూతిని అందిస్తుంది. కథ అంతా కూడా ‘లండన్’లో జరుగుతుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఇందుకోసం 100 కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా. ఒక స్టార్ హీరో ఈ సినిమాలో చేయనున్నారు” అంటూ చెప్పుకొచ్చారు.
Must Read ;- సంక్రాంతి బరిలోకి దిగనున్న రామారావు?











