అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. ప్ర్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇది పాన్ ఇండియా సినిమా .. అందుకు తగినట్టుగానే ఆర్టిస్టులను ఎంపిక చేశారు. పాటలను కూడా ఆయా భాషలకు చెందిన సింగర్స్ తోనే పాడించారు. ఈ సినిమా నుంచి ఫస్టు సాంగును రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఒకే పాటను ఒకే సమయంలో ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఆయా భాషలలో పాపులర్ అయిన సింగర్స్ తోనే ఈ పాటను పాడించారు. ఈ నెల 13వ తేదీన ఫస్టు సాంగ్ పలకరించనుంది. ‘దాక్కో దాక్కో మేక’ అంటూ ఈ పాట సాగనుంది. ఈ పాట ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. కథా కథనాలు మాత్రమే కాదు, దేవిశ్రీ సంగీతం కూడా ఈ సినిమాకు ప్రధానమైన బలంగా నిలవనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాటలన్నీ కూడా మాస్ ఆడియన్స్ మనసులకు దగ్గరగా ఉంటాయని అంటున్నారు.
ఇది ఒక దట్టమైన అడవి చుట్టూ తిరిగే కథ .. అడవివరకూ పాకిన అవినీతి కథ. ఈ కథలోని పాత్రలన్నింటినీ సుకుమార్ చాలా విభిన్నంగా తీర్చిదిద్దాడు. మాటలు … పాటలు .. డాన్సులు .. ఫైట్లు .. ఇలా ప్రతి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. కథానాయికగా రష్మిక నటిస్తున్న ఈ సినిమాలో, అనసూయ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను ‘క్రిస్మస్’కి విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
Must Read ;- అల్లు కుటుంబంలో బుల్లి నటి అర్హ











