కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి దేశ వ్యాప్తంగా అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న వయసులోనే ఆయన తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడం ప్రతి ఒక్కరి హృదయాలనూ కలచి వేసింది. పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్, శ్రీకాంత్ లతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నిన్న నాగార్జున బెంగళూరుకు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘పునీత్ గారు లేరు అనే వార్త తెలిసినప్పుడు షాక్ అయ్యాను. ఇప్పటికీ ఇది నమ్మలేకపోతున్నాను. ఇది నిజంగా జరిగిందా అనిపిస్తోంది. ఇక్కడకి వచ్చిన తర్వాత కూడా శివన్నతో ఏం చెప్పాలో ఏమీ తెలియడం లేదు. పునీత్ గారి గురించి ఎవరు మాట్లాడినా మంచే మాట్లాడతారు. ఎంతో మంది స్కూల్ పిల్లలని చదివిస్తున్నారు. ఆయన హీరోగా కాకుండా టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ వేరే వాళ్లతో నాలుగు సినిమాలు తీస్తున్నాడు. అలాంటి మంచి మనిషిని దేవుడు ఎందుకు తీసుకెళ్లిపోయాడో అర్ధం కావడం లేదు. ఈ ప్రశ్నకు సమాధానం లేదు. పునీత్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, కర్ణాటక ప్రజలకు నా ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ బాధ నుంచి బయటపడడం కోసం దేవుడు వాళ్లకి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అన్నారు.
Must Read ;- పునీత్ కి నిజంగా నిజమైన స్నేహితుడు విశాల్

ఈరోజు రామ్ చరణ్ కూడా పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ తో తనకు ఉన్న అనుబంధాన్ని చరణ్ నెమరు వేసుకున్నారు. పునీత్ మరణించిన సమయంలో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ చిత్రంలో చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. అందువల్ల ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్ ను ముగించుకున్న తర్వాత పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి చరణ్ పరామర్శించారు. ఆ సమయంలో అందుబాటులో లేని చాలా మంది ప్రముఖులు బెంగళూరులో పునీత్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.











