కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆయన మరణించారని, ఈ వార్తను ఇంకా అధికారికంగా వెల్లడించడం లేదన్న వదంతులు ఉన్నాయి. ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులో విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. కన్నడ కంఠీరవ కుమారుడైన పునీత్ రాజ్ కుమార్ కన్నడంలో సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆయన వయసు 46 సంవత్సరాలు.
ఈరోజు ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయినట్టు తెలిసింది. ఐసీయూలో చికిత్స అందించారు. ఆయన అనారోగ్య వార్త తెలిసిన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.. సీనియర్ పోలీస్ అధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ నివాసానికి సైతం భద్రత కల్పించారు.
పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్ కుమార్తె నివేదిత.. పునీత్ కుటుంబ సభ్యులు.. క్రేజీ స్టార్ రవిచంద్రన్, నిర్మాతలు జయన్న, కేపీ శ్రీకాంత్ తదితరులు ఆసుపత్రికి చేరుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆసుపత్రికి చేరుకుని పునీత్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు పునీత్ మూడో కుమారుడు. సోలో హీరోగా 2002లొ అప్పు సినిమాతో చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు. దీనికి పూరి జగన్నాథ్ దర్శకుడు.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై మధ్యాహ్నం మూడు గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. పునీత్ రాజ్ కుమార్ 1975 మార్చి 17న జన్మించారు. ఇప్పటివరకు 29 సినిమాల్లో హీరోగా నటించారు. కన్నడ సినీ పరిశ్రమలో పవర్ స్టార్ గా ఈయన్ని చెబుతుంటారు. అలాగే అప్పు అనే ముద్దు పేరుతోనూ పిలుస్తుంటారు. ఐదేళ్ల వయసులోనే నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. తన తండ్రి రాజ్ కుమార్‌తోనూ కలిసి నటించారు. బాలనటుడిగా ఉత్తమ జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.
ఆ తర్వాత అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. నిర్మాతగా కొన్ని చిత్రాలు చేశారు. టీవీ కార్యక్రమాలకు హోస్ట్ గానూ, గెస్ట్ గానూ, న్యాయనిర్ణేతగానూ వ్యవహరించారు. అనేక సినిమాల్లో బాలనటుడిగా నటించారు. ఆయన మొదట్లో నటించిన అప్పు చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో రక్షిత హీరోయిన్. అంతకుముందు పరశురామ్ చిత్రంలోనూ అప్పు అనే పాత్రనే పోషించారు. అందుకే పూరి తన సినిమా టైటిల్ ను అప్పు అనే పెట్టారు. అదే ఆయనకు ముద్దు పేరుగా మారింది.
Must Read ;- కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత











