రేషన్ డోర్ డెలివరీ వాహనాల ఆపరేటర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తుండడంతో.. అధికారులు.. వారిపై పట్టు కోల్పోయారు. దీంతో.. చేసేదిలేక అధికార యంత్రాంగం మళ్లీ రేషన్ పంపిణీని డీలర్లకే అప్పగిస్తోంది. ఇందుకు పోర్టబులిటీ అనే అస్త్రాన్ని వాడుకుంటోంది. ఈ మొత్తం వ్యవహారంలో దిగువస్థాయి అధికారుల పరిస్థితే మరీ దయనీయంగా తయారైంది.
ప్రయోజనం లేదు..
రేషన్ బియ్యాన్ని ఇతరులకు అమ్మేసుకోవడాన్ని అరికట్టేందుకు ఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చిన ప్రభుత్వానికి ఆ ఎండీయూలే చుక్కలు చూపిస్తున్నారు. రేషన్‌ను ఇంటింటికీ పంపిణీ చేయకుండా ఎక్కడో ఒకచోట పెట్టి, జనాన్ని క్యూలలో నిలబెట్టి పంపిణీ చేస్తున్నారు. దీని కోసం కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నా.. ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. ఎండీయూలు లేని కొన్నిచోట్ల.. అధికారులే.. ప్రయివేటు వ్యక్తులను డ్రైవర్‌లుగా పెట్టి, వీఆర్వో లాగిన్‌లో పంపిణీ చేయిస్తున్నారు. ఒకే ఎండీయూకు రెండు మూడు డిపోలు కేటాయించడం వంటి చర్యలతో బియ్యం అందని ప్రజలు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు.

సరిగ్గా లేని పనితీరు..
ఈ నెలలో 21 రోజులు గడిచిపోయినా, ఇంకా 40 శాతం మందికి బియ్యం అందలేదు.. తమకు కేటాయించిన షెడ్యూలు ప్రకారం తమ డ్యూటీ అయిపోయిందని కొన్ని చోట్ల ఎండీయూలు రాకపోతుండడంతో. అధికారులే వారిని బతిమిలాడి మరీ లాగిన్ చేయిస్తున్నారు. కొన్ని చోట్ల డీలర్లను ఎండీయూ వాహనాల వెంట వెళ్లమని తహసీల్దార్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎండీయూ వాహనాల వెంట వెళ్లే డీలర్లను ఎవరైనా అపితే , క్రిమినల్ కేసులు పెడతామని వాయిస్ మెసేజ్‌లు పెడుతున్నారు. కానీ, సగానికిపైగా ఎండీయూలు తమకు కేటాయించిన కార్డుల్లో 50 శాతం కూడా పంపిణీ చేయలేదు. దీంతో అధికారులు.. మిగిలిన పంపిణీని డీలర్లకు అప్పగించనున్నారు.
అతి తెలివి ఫలితమా..
మొత్తానికి ప్రభుత్వం ఏదో కొత్తగా చేస్తున్నామనుకుంటూ ప్రారంభించిన ఈ పథకం.. అస్తవ్యస్తంగా తయారై.. రేషన్ సరుకులు ఇంటికి చేరే విషయం అటుంచితే.. చివరికి అసలు సరుకులే రాకుండా పోతున్నాయంటూ ప్రజలు వాపోతున్నారు. వేలకు వేలు జీతాలిచ్చి డ్రైవర్లు, లక్షలు ఖర్చుపెట్టి వాహనాలు అవసరమా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతకు ముందు రేషన్ షాపునకు తమకు కుదిరినప్పుడు వెళ్లి సరుకులు తెచ్చుకునే వాళ్లమని, ఇప్పుడు జగన్ అతి తెలివి పుణ్యమాని అసలు సరుకులే అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- ఉద్యోగుల టెన్షన్ : నేటికీ అందని ఫించన్లు, వేతనాలు