Rave Party Busted In Guntur City :
భాగ్య నగరి హైదరాబాద్ సహా పలు రాష్ట్రాల్లోని నగరాల్లో రేవ్ పార్టీలు కొత్తేమీ కాదు. అయితే అశ్లీలానికి, మత్తు పదార్థాలకు నెలవుగా మారిన ఈ రేవ్ పార్టీలు.. ఇప్పుడు ఏపీలో ఏకంగా ఇళ్లలోకే చొరబడిపోయాయి. కుటుంబాలతో నిత్యం కోలాహలంగా ఉండే నివాస సముదాయాల్లోనే రేవ్ పార్టీలను ఏర్పాటు చేస్తున్న ఏపీ వాసులు.. వాటికి ప్రముఖులను ఆహ్వానిస్తూ.. ఖాకీల దాడుల నుంచి తప్పించుకునేందుకు పోలీసు అధికారులను కూడా ఆహ్వానిస్తూ.. వారికి కూడా ఈ ఆనందాన్ని పంచుతున్న వైనం కలకలం రేపుతోంది. ఏపీ కేపిటల్ అమరావతికి కూత వేటు దూరంలో గుంటూరు నగర పరిధిలోని లక్ష్మీపురంలో మంగళవారం తెల్లవారుజామున వెలుగు చూసిన ఓ రేవ్ పార్టీ ఇప్పుడు కొత్త చర్చకు తెర లేపింది.
జనావాసాల మధ్య రేవ్ పార్టీనా?
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత ఏపీ రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించిన చంద్రబాబు సర్కారు.. హైదరాబాద్ నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించింది. అయితే ఆ సమయానికి సరిపడినన్ని ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో కొన్ని కార్యాలయాలను విజయవాడలో మరికొన్ని కార్యాలయాలను గుంటూరులో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈ రెండు నగరాలకు మరింత కలరింగ్ వచ్చిందనే చెప్పాలి. అంతేకాకుండా అమరావతి కూడా ఈ రెండు నగరాల మధ్యలో ఉండటంతో అంతకంతకూ వీటిలో జనం రద్దీ బాగానే పెరిగింది. జనం రద్దీతో పాటు సిటీ కల్చర్ కూడా మారుతూ వచ్చింది. ఈ క్రమంలో అసాంఘీక కార్యకలాపాలు కూడా పెరిగాయి. తాజాగా గుంటూరు పరిధిలోని లక్ష్మీపురంలో రేవ్ పార్టీ జరిగింది. లక్ష్మీపురంలో నివాస సముదాయాల్లోనే ఓ భవనంలో జరిగిన ఈ రేవ్ పార్టీపై పట్టాభిపురం పోలీసులకు సమాచారం అందగా.. దాడి జరిగింది.
సీఐ, ముగ్గురు ప్రముఖులు మిస్
మంగళవారం తెల్లవారుజామున జరిగిన పోలీసుల దాడిలో రేవ్ పార్టీలో పాలుపంచుకున్న ఐదుగురు యువతులతో పాటు 20 మంది యువకులు పట్టుబడ్డారు. అయితే ఈ పార్టీలో ఓ పోలీస్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ తో పాటు ముగ్గురు ప్రముఖులు కూడా పట్టుబడ్డారని, అయితే వారిని పోలీసులు తప్పించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రేవ్ పార్టీ నిర్వాహకుల తెలివిమీరిన తనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అంతేకాకుండా రేవ్ పార్టీలో పాలుపంచుకున్న సీఐ ఎవరు? తప్పించబడిన ముగ్గురు ప్రముఖులు ఎవరు? ఏ రంగానికి చెందిన వారు? రాజకీయ రంగానికి చెందిన వారేనా? ఏ రాజకీయ నేత పుత్రరత్నాలు వారు?.. ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. పోలీసు దాడుల నుంచి తప్పించుకునేందుకే రేవ్ పార్టీ నిర్వాహకులు పిలిస్తేనే వీరు వెళ్లారా? లేదంటే వీరే ఆ పార్టీని నిర్వహించారా? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.
Must Read ;- ఏపీ సీఎం జగన్ ఇక మాజీనే











