Survey Predicts YSRCP In Critical Condition :
ఎంత కప్పి పుచ్చుకున్నా, ప్రభుత్వ వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా ఉందని వైసీపీ పెద్దలకు సొంత సర్వేతోనే తేటతెల్లమైంది. ఇటీవల కాలంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డబ్బు ఇచ్చి మరీ నడిపిస్తున్న కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానళ్లలోనూ జగన్ గ్రాఫ్ పడిపోయిందని, ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా పెరిగిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే సదరు సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు తమ డబ్బు తింటూ తమకే ఇలా ద్రోహం చేయవు కదా అనే ఆలోచనతో వైసీపీకి గత కొన్నేళ్లుగా సర్వేలు చేస్తోన్న హైదరాబాద్ కేంద్రంగా ఉండే ఓ సంస్థకి సర్వే బాధ్యతలు అప్పగించారు. ఆ బృందం ఆత్మసాక్షిగా తన కోర్ టీమ్‌తో రంగంలోకి దిగింది. మే నెలలో 25 రోజులకు పైగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సర్వే నిర్వహించింది. వైసీపీ పెద్దలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని, తమ గత సర్వేలు 99 శాతం నిజం కావడాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా పకడ్బందీగా ఈ సర్వే చేపట్టింది. 24,800 శాంపిల్‌లు తీసుకుని విశ్లేషించి.. తుది నివేదిక పెద్దలకు అందజేశారు.
60 మందికి ఓటమి.. 20 మందికి టఫ్ ఫైట్
ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 60 మంది వరకూ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఓటమి ఖాయమేనట. మరో 20 సీట్లలో వైసీపీ అభ్యర్థులకు హోరాహోరీ పోరు తప్పదట. ఇక జగన్ కేబినెట్‌లోని 25 మంది మంత్రులలో 9 మంది ఓటమిని ఆ భగవంతుడు కూడా ఆపలేరట. మరో ఆరుగురికి హోరాహోరీ పోరు తప్పదట. ఈ విషయాలను సర్వే బృందం గణాంకాలతో సహా వైసీపీ పెద్దలకు నివేదించారట. దీనిపై చర్చించిన పెద్దలు.. ఓటమి బాటలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల జాబితా తీసుకుని.. వారిపై అర్జంటుగా ఇంటిలిజెన్స్ రిపోర్ట్ కావాలని పురమాయించారట. ఎంతగా పక్కా గణాంకాలు ఇచ్చినా ఈ సర్వే నివేదికను వైకాపా పెద్దలు అస్సలు నమ్మడం లేదట. తమకు తిరుపతి ఉప ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం, స్థానిక సంస్థలలో ఏకగ్రీవాలు, మున్సిపాలిటీలలో హవాని చూపిస్తూ..వ్యతిరేకత ఎక్కడ ఉందని సర్వే హెడ్‌ని ఏకంగా నిలదీసినంత పనిచేశారట. అధికారంలో ఉన్నప్పుడు వచ్చే ఉప ఎన్నికలు, ఏకగ్రీవాలను బలం అనుకోవద్దని.. చంద్రబాబు అధికారంలో ఉండగా.. వైసీపీ గెలిచిన నంద్యాల సీటుని టీడీపీ ఎలా చేజిక్కించుకుందని ఆ హెడ్ వివరించారట. ఆ తరువాత తారుమారైన ఓటింగ్, పోల్ మేనేజ్‌మెంట్ లెక్కలను తీసి మరీ ఆయన వివరించారట.
జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఇదీ..
ఉత్తరాంధ్రలో మళ్లీ టీడీపీ పుంజుకుందని, గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ బలపడుతోందని, నెల్లూరులో ఒక్క సీటూ లేని టీడీపీ ప్రభావవంతంగా మారుతోందని సర్వే తేల్చేసిందట. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీకి గడ్డు పరిస్థితి తప్పదని చెప్పేసిందట. రాయలసీమలో మాత్రం అనంతపురంలో టీడీపీ కోలుకుని గట్టి పోటీ ఇస్తుందని.. కడప, చిత్తూరు జిల్లాలు వైసీపీవైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని పేర్కొందట. కర్నూలులోనూ ఒక్క సీటూ గెలవని టీడీపీ తిరిగి ఫామ్‌లోకొచ్చే పరిస్థితులే కనపడుతున్నాయని వివరించిందట. అధికారం ఉన్నా తమకు ఎలాంటి ఉపయోగం లేదని కేడర్‌లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందని.. పార్టీ కోసం పదేళ్లు ఖర్చుపెడితే ఎటువంటి ఉపయోగం లేదనే నిరాశలో కొందరు కీలక నేతలు కూడా ఉన్నారని నివేదించిందట. మొత్తంగా ఇటు ప్రజల్లోనే కాకుండా అటు శ్రేణుల్లోనూ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి ఉండటంతో పాటు అది అంతకంతకూ పెరిగిపోతోందన్న నగ్న సత్యాన్ని సదరు సర్వే వైసీపీ పెద్దల ముందు పెట్టిందట.
జనాగ్రహానికి కారణాలేంటంటే..?
ఇసుక కొరత, లిక్కర్ మాఫియా, ధరలు పెరుగుదల, ఉపాధి, ఉద్యోగావకాశాలు లేకపోవడం, ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వకపోవడం, వారికిచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. ఇలా వరుసపెట్టి సమస్యలను ప్రజలు ప్రస్తావిస్తున్న వైనాన్ని ఆ సర్వే ప్రధానాంశంగా వెల్లడించిందట. జగన్ పాలనా వైఫల్యాలపై పదే పదే ప్రస్తావిస్తునమ్న న్యూట్రల్ ప్రజల్లో జగన్‌కు ఒక్క చాన్స్ ఎందుకిచ్చామా అనే ఆలోచన ఆరంభమైందని తేల్చిందట. ఈ మొత్తం విషయాలను పూసగుచ్చినట్లుగా ఆ సర్వే బృందం ప్రభుత్వ పెద్దలకు ఫుల్లుగానే ఫీడ్ బ్యాక్ ఇచ్చిందట. అంతేకాకుండా వరుసపెట్టి జరుగుతున్న ఆందోళనలు.. ఆ ఆందోళనల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాలుపంచుకుంటున్న వైనం, ఏకంగా సీఎం, మంత్రుల ఇళ్ల ముట్టడికి జనం సిద్ధపడుతున్న వైనం, ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు నిత్యకృత్యమైన తీరును కూడా ఆ సర్వే బృందం తన నివేదికలో ప్రధానంగా ప్రస్తావించిందట.
దిద్దుబాటు మొదలైనట్లేనా?
ఈ సర్వేను చూసిన సీఎం జగన్.. క్షేత్రస్థాయి పర్యటనలు, మంత్రులు జిల్లాలవారీగా పర్యటనలు విస్తృతం చేసి ప్రజల్లోకి వెళ్లకపోతే ఇంకా అసంతృప్తి పెరిగిపోవడం ఖాయమన్న ఓ భావనకు వచ్చినట్టుగా సమాచారం. అలాగే రెండున్నరేళ్ల తరువాత మంత్రులను మారుస్తామని ప్రమాణస్వీకారం రోజే ప్రకటించిన సీఎం.. తాజాగా సర్వేలో ఓడిపోతారని తేలిన మంత్రులందరినీ రెండున్నరేళ్ల నెపంతో కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 151 మందిలో ఓడిపోయే అవకాశాలున్న 60 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించారట. ఈ నియోజకవర్గాల్లో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి ప్రత్యామ్నాయంగా మరో నాయకుడిని ఎంపిక చేసే పని కూడా అప్పుడే మొదలైందన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఈ ప్రత్యామ్నాయ నేతలకు ఇప్పుడే ఏదో ఒక కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించి, ఇప్పటి నుంచే వారిని రేసులో ఉంచే ప్లానింగ్ కూడా జగన్ మొదలెట్టేశారని సమాచారం. మొత్తంగా తమకు నమ్మకమైన సంస్థతో చేయించుకున్న సర్వేలో తేలిన నిజాలతో జగన్‌లో అప్పుడే ఓటమి భయం మొదలైపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ఏపీ సీఎం జగన్ ఇక మాజీనే