రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. పీవీ రమేష్ తన ట్విట్టర్ లో విప్లవ రచయిత వరవరరావు మాటలను ట్వీట్ చేశారు. ‘నేరమే అధికారమై ప్రజలను నేరస్తుల్ని చేసి వెంటాడుతుంటే.. ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడే’ అని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కారును ఉద్దేశించి చేశారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. రాజకీయవర్గాల్లో చర్చకూడా మొదలైంది. అయితే ఆదివారం సాయంత్రం ఆయన మరోసారి ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను వరవరరావు మాటలనే కోట్ చేశానని, ఆయన రచనలోని సారాంశాన్ని తాను ట్విట్టర్‌లో పేర్కొన్నానన్నారు. ఈ మాటలను వ్యక్తులకు లేదా వ్యవస్థలకు ఆపాదించి మాట్లాడేవారి ఆలోచనా శక్తి చాలా సంకుచితంగా మారుతుందని వ్యాఖ్యానించారు.
ట్రోల్‌కి కారణం ఇదేనా..
పీవీ రమేష్ గతంలో చంద్రబాబు, వైఎస్ సర్కారుల్లో కీలకంగా పనిచేసి కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. వైఎస్ జగన్ ఏరికోరి పీవీరమేష్‌ను తన ప్రభుత్వంలో సేవలించేందుకు ఆహ్వానించారన్న చర్చ కూడా అప్పట్లో నడిచింది. ఆయన రాష్ట్ర సర్వీసులకు వచ్చాక సీఎం జగన్ సర్కారులో అదనపు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అయితే తరువాత కొంత కాలానికి పీవీ రమేష్ బాధ్యతలను సమాచారం లేకుండానే..వేరే వ్యక్తులకు అప్పజెప్పారని, దీంతో నొచ్చుకున్న పీవీ రమేష్ తాను ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారని ప్రచారం జరిగింది. గత ఏడాది నవంబరులో 1న రాజీనామా చేశారు.
కస్టమర్ సర్వీసులా..
కాగా పీవీరమేష్ గతంలోనూ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేయడం పైనా చర్చ నడిచింది. 1961 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కేబీఎస్ సిద్దూ గత జులైలో ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వెనుక ఉద్దేశం ఏంటనేది తెలియదు. కాని ఆయన చేసిన ట్వీట్ మాత్రం చర్చకు కారణమైంది. దేశంలో ఐఏఎస్ అనేది రాజకీయ నేతలు, వ్యాపారస్తులను మెప్పించే కస్టమర్ సర్వీస్‌గా మారిపోయిందని వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు. పీవీ రమేష్ దీన్ని రీట్వీట్ చేశారు. సాధారణంగా అయితే ఈ ట్వీట్‌లు అంతగా చర్చకు వచ్చేవి కాదని, అయిత ఏరికోరి తెచ్చుకున్న పీవీ రమేష్‌ను జగన్ అర్థంతరంగా బాధ్యతలను తప్పించడం.. ఈ ట్వీట్‌కు సరిగ్గా సరిపోతుందని, కస్టమర్ సర్వీసు అంటే ఎవరు అనే ప్రశ్నపైనా అప్పట్లోనే చర్చ నడిచింది. అంతేకాదు..అప్పట్లోనే పీవీ రమేష్‌తో పాటు మరో ఇద్దరు సలహాదారులు అజేయ కల్లం, మురళిల విషయంలోనూ జగన్ సర్కారు ఇలాగే వ్యవహరించిందనే చర్చ నడిచింది.
ఇప్పుడు తాజాగా చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో వార్ మొదలైందని చెప్పవచ్చు. ఆలస్యంగా కళ్లు తెరిచారని ఒకరు, అవినీతి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు ఇప్పటికైనా మేల్కోవాలని మరికొందరు…ఇలా ఎవరి అభిప్రాయాలను వారు రిప్లైగా ట్వీట్ చేస్తున్నారు. ఇక పీవీ రమేష్ చేసిన ట్వీట్‌లో అర్థం, పరమార్థం ఏంటనే విషయం పక్కన బెడితే..రాజకీయ వర్గాల్లో మాత్రం పెద్ద చర్చే నడిచింది.
Must Read ;- ఓట్లతో వైసీపీ రౌడీయిజం అంతం చేయండి.. గుంటూరు రోడ్ షోలో చంద్రబాబు పిలుపు













