నాగార్జునసాగర్ ఎన్నికలకు కొన్నాళ్ల ముందు నుంచి ఎన్నికలు పూర్తయ్యేవరకు దూకుడు తగ్గించినట్టుగా కనిపించిన మల్కాజ్‌గిరి ఎంపీ,టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి మళ్లీ దూకుడు పెంచారు. ఓవైపు అధికార టీఆర్ఎస్‌ను విమర్శిస్తూనే కొవిడ్ బాధితుల కోసం ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.బొల్లారంలో 50 పడకల కొవిడ్ ఆస్పత్రిని ప్రారంభించడంతోపాటు ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి, డీఆర్‌డీవో చైర్మన్‌కు కూడా లేఖలు రాశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి కూడా ట్వీట్ చేశారు.కరోనా విజృంభిస్తున్నందున స్థానిక ఎంపీగా, ఓ ప్రజాప్రతినిధిగా తన వంతు బాధ్యతగా కంటోన్మెంట్ బొల్లారం ప్రాథమిక ఆరోగ్ కేంద్రాన్నికోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేశామని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన పనులు త్వరగా పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని కోరారు.అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోనూ ఇటీవల కొంత మార్పు కనిపిస్తోందనే చర్చ మొదలైంది.
తాజాగా గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో..
తాజాగా గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో ప్రతిరోజూ వెయ్యి మందికి ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, సోనియాగాంధీ, రాహుల్ ఆదేశాల మేరకు ఈ భోజనం ఏర్పాట్లు చేశామన్నారు.లాక్‌డౌన్ కారణంగా కొవిడ్ బాధితులకు,వారి కుటుంబసభ్యులకు భోజనాలు దొరికే పరిస్థితి లేదని, ప్రభుత్వం గతంలోనూ, ఇప్పుడు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదన్నారు. యూత్ కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేసేందుకు ముందుకొస్తుంటే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.రూ. 5 భోజన కార్యక్రమాన్నికాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని,కరోనా సమయంలోనూ ప్రభుత్వం ఇలాంటి ఏర్పాట్లు చేయకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.కాగా కొవిడ్ మొదటి వేవ్ సమయంలోనూ రేవంత్‌రెడ్డి వలస కార్మికుల కోసం,పేదల కోసం భోజన ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.
ఈటల వ్యవహారం తరువాత..
దేవరయాంజిల్ ప్రాంతంలో భూముల ఆక్రమణ ఆరోపణలపై వైద్య మంత్రిగా ఉన్న ఈటలను కేబినెట్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే.అయితే ఇదే ప్రాంతంలో మంత్రి మల్లారెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులకు,వారి బంధువులకు భూములున్నాయని పలు డాక్యుమెంట్లు చూపిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇది చర్చనీయాంశమైంది.గతంలో జీవో నెం.11కి విరుద్ధంగా భవనాలు నిర్మించారని ఆరోపిస్తూ డ్రోన్ వినియోగించిన కేసులో రేవంత్ జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు పెద్దగా స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లోనే విమర్శలు వచ్చాయి.రేవంత్ రెడ్డి ఒంటరి అయ్యారా అనే చర్చ కూడా నడిచింది.తాజాగా దేవరయాంజిల్ భూముల వ్యవహారంలో పలువురు కాంగ్రెస్ నాయకులు రేవంత్‌కి సపోర్టు చేస్తున్ననేపథ్యంలో రాష్ట్ర రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా విమర్శలు చేశారు. భూములు ఆక్రమించారని ఆరోపించారు.ఇప్పటికే వీహెచ్,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటివారు కూడా ఈ భూముల విషయంలో టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించడమే ఈ చర్చకు కారణమైంది.ఓవైపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు కొవిడ్ సమయంలో ప్రజలకు, కొవిడ్ బాధితులకు అండగా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపడుతుండడంతో పార్టీ శ్రేణుల్లోనూ ఆనందం వ్యక్తం అవుతోంది.
Must Read ;- AskKTRలో ఎక్కువ వైద్య ఆరోగ్యశాఖవే.. ఈటల తర్వాత ఆయన లైన్‌లోకి