అందుకే అంతర్వేదిలో రథం దగ్ధంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మూడు రోజులు నోరు తెరవకపోవడంపై ఆర్ ఎస్ ఎస్ గుర్రుగా ఉందని తెలుస్తోంది. అందుకే వైసీపీ ప్రభుత్వ హిందూ వ్యతిరేక చర్యలపై ఉధ్యమించాలని ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ నిర్ణయించాయని సమాచారం. అందుకే బుధవారం అంతర్వేది చేరుకున్న వందలాది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు పోలీసుల వలయాలను చేధించుకుని దేవాలయం వరకూ వెళ్లి ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
దేవాదాయశాఖ మంత్రి కాన్వాయ్ పై రాళ్లు రువ్వింది ఎవరు?
అంతర్వేది రథం దగ్ధం అయ్యాక అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు తీవ్ర ప్రతిఘటన తప్పలేదు. ఆయన కాన్వాయ్ పై కొందరు రాళ్లు కూడా రువ్వారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం 40 మంది అనుమానితులను అరెస్టు చేసింది. దీనిపై బీజేపీ నేతలు పెద్దగా స్పందించకపోయినా, ఆర్ఎస్ఎస్ మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ప్రభుత్వ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని వారు భావిస్తున్నారని సమాచారం.
ఏపీ బీజేపీ నేతల తీరుపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు
అంతర్వేది రథం దగ్ధం విషయంలో ఏపీ బీజేపీ నేతలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆర్ ఎస్ ఎస్, భజరంగ్ దళ్ నేతలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే అంతర్వేదిలో భారీ ఉద్యమం చేసినా ఎక్కడా బీజేపీ జెండా లేకుండా జాగ్రత్త పడ్డారని సమాచారం. ఉత్తరాంధ్ర భజరంగ్ దళ్ విభాగం కూడా అంతర్వేది విషయంలో సీరియస్ గానే పోరాడుతోంది. వందలాది మంది పోలీసులు అడ్డుకున్నా జై శ్రీరామ్ అంటూ పోలీసు వలయాలను చేధించుకుంటూ అంతర్వేది దేవాలయం వద్దకు చేరుకోగలిగారు. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై సీఎం జగన్మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను తన నివాసానికి పిలిపించుకుని క్లాసు పీకారట. దీంతో మంత్రి నష్ట నివారణ చర్యలకు దిగారని తెలుస్తోంది.
రథం దగ్ధంపై సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం
ఏపీ బీజేపీతో వైసీపీ ప్రభుత్వానికి సమస్య లేకపోయినా ఆర్ ఎస్ ఎస్, భజరంగ్ దళ్ చేసిన ఉద్యమంతో ప్రభుత్వం కళ్లు తెరిచింది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం వారం రోజుల్లో నిందితులను పట్టుకోలేకపోతే కేసు సీబీఐకి అప్పగించే అవకాశం ఉంది. ఈ లోగా ఆర్ ఎస్ ఎస్, భజరంగ్ దళ్ నేతలు, కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరాలని భావిస్తున్నారని వినికిడి. రాబోయే కొద్ది రోజుల్లో వైసీపీ ప్రభుత్వం అంతర్వేది రథం దగ్ధంతోపాటు, రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులను సీరియస్ తీసుకోకపోతే వారికి కేంద్రం నుంచి ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది.
అందుకే ఏపీ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. అంతర్వేదిలో దగ్ధమైంది కేవలం రథం కాదని హిందువుల మనోరథమని హిందూ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం ఆలోచనలో పడింది. దేవాలయాలపై దాడుల సంఘటనలను సీరియస్ గా తీసుకోవాలని పోలీసు అధికారులను సీఎం ఆదేశించారని తెలుస్తోంది.










