Sama Venkata Reddy Resigns TRS :
గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బుధవారం నాటి పరిణామాలు సంతోషాన్ని మిగిల్చాయా? లేదంటే షాక్ నకు గురి చేశాయా? అంటే.. సంతోషం కంటే కూడా దానికి పదింతల మేర షాక్ ను కేసీఆర్ అనుభవించారని చెప్పక తప్పదు. ఎందుకంటే.. వైరి వర్గాన్ని దెబ్బ కొట్టేందుకు గులాబీ దళం సిద్ధం చేసుకున్న పాడి కౌశిక్ రెడ్డి అధికారికంగా టీఆర్ఎస్ లో చేరిపోతే.. గులాబీ దళానికి భీకరమైన షాకిస్తూ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సామ వెంకట్‌రెడ్డి.. ఆ మండలి కార్యవర్గ సభ్యులందరితో కలిసి టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేశారు. అంతేకాకుండా టీఆర్ఎస్ కు వీడ్కోలు పలికిన ఆయన నేరుగా కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు. ఈ మేరకు బుధవారం చోటుచేసుకున్న ఈ రెండు పరిణామాల్లో పాడి చేరిక కేసీఆర్ కు ఓ మోస్తరు ఆనందాన్నిస్తే.. సామ ఎగ్జిట్ కేసీఆర్ సహా యావత్తు గులాబీ దళాన్ని షాక్ కు గురి చేసిందని చెప్పక తప్పదు.
కౌశిక్ ఎంట్రీ ప్రీ ప్లాన్డేగా
కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ టీఆర్ఎస్ కు కోవర్టుగా వ్యవహరిస్తున్నారంటూ ముద్ర పడిపోయిన పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడేలోగా ఏదో సమయంలో టీఆర్ఎస్ లో చేరిపోవడం ఖాయమని అంతా అనుకున్నదే. అయితే కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా తనను తాను ఓ వీడియో రూపంలో బయటపెట్టుకున్న కౌశిక్.. ఆ పార్టీకి రాజీనామా చేయక తప్పలేదు. అంతకు కొన్ని నిమిషాల ముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనను ఏకంగా బహిష్కరించేసింది. ఈ నేపథ్యంలో అసలు కౌశిక్ రాజకీయ పరిస్థితి ఏమవుతుందన్న కోణంలో ఆసక్తికర వాదనలు వినిపించాయి. ఎట్టకేలకు బుధవారం ఆయన టీఆర్ఎస్ లో చేరిపోవడంతో.. అది పాడికి కలిసివచ్చిందే గానీ, టీఆర్ఎస్ కు పెద్దగా కలిసివచ్చేదేమీ కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సామ ఎగ్జిట్ ఊహించని ఎదురుదెబ్బే
ఇక సామ వెంకటరెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతూ.. ఏకంగా తనకు ప్రభుత్వం అప్పటించిన పదవిని వదిలేసి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లుగా ప్రకటించిన వైనం టీఆర్ఎస్ కు నిజంగానే ఊహించని ఎదురు దెబ్బేనని చెప్పాలి. ఎందుకంటే.. సామ పార్టీ చిన్న స్థాయి నేతేమీ కాదు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నేత. ఉద్యమమే ఊపిరిగా సాగిన నేత. అందుకే కాబోలు.. కేసీఆర్ ఆయనకు తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఈ పదవిని వదిలేసిన సామ.. సదరు మండలిలోని కార్యవర్గ సభ్యులందరి చేతా టీఆర్ఎస్ కు రాజీనామా చేయించి మరీ తన వెంట కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లిపోతున్నారు. బుధవారం టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వెంకట్‌రెడ్డి ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌తో సమావేశమయ్యారు. ఈ పరిణామం కేసీఆర్ శిబిరంలో పెను కలవరమే రేపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- పాడి కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ షాక్ : 5.8 లక్షల ఫైన్!