తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు.. జయ మరణం తర్వాత లెక్కలేనన్ని చిక్కులు చుట్టుముట్టాయి. ఇప్పటికే ఆర్థిక నేరాలకు సంబంధించి దోషిగా తేలిన ఆమెకు బుధవారం నాడు ఊహించని షాక్ ఎదురైంది. శశికళకు చెందిన 11 ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. తమిళనాడులోని పయనూర్ గ్రామంలోని 24 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆస్తులు ఉన్నాయి. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న 1991-1996 మధ్యకాలంలో ఈ ఆస్తులను శశికళ కొనుగోలు చేశారు. ఈ ఆస్తులను కొనుగోలు చేసే సమయంలో వాటి విలువ రూ.20 లక్షల వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు వాటి విలువ దాదాపు రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కేసు ఏమిటంటే..?
2014లో కర్ణాటక స్పెషల్ కోర్టు జడ్జి జాన్ మిఖాయెల్ కున్హా ఈ ఆస్తులను అక్రమాస్తులుగా నిర్ధారిస్తూ తీర్పును వెలువరించారు. ఆ అక్రమాస్తులు జయలలిత, శశికళకు చెందినవని తెలిపారు. ఆనాటి కోర్టు తీర్పును అనుసరించి బినామీ నిరోధక చట్టం కింద ఐటీ శాఖ బుధవారం ఆ ఆస్తులను సీజ్ చేసింది. ఆస్తులు ఉన్న ప్రాంతంలో వాటిని సీజ్ చేసినట్టు నోటీసులు అతికించారు. అయితే, ఇక్కడ గమనించదగ్గ అంశం ఏమిటంటే, ఈ ఆస్తులను శశికళ ఉపయోగించుకోవచ్చు, కానీ ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు జరపడానికి మాత్రం వీలుండదు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత శశికళ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన సంగతి తెలిసిందే.
శిక్ష తర్వాత షాకులేనా?
జయలలితపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏకంగా నాలుగేళ్ల పాటు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవించిన శశికళ ఇటీవలే విడుదలయ్యారు. జయ మరణం తర్వాత శశికళను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే జయ కేసులను మళ్లీ తిరగదోడారన్న వాదనలు వినిపించాయి. అయితే ఆ ఆరోపణలేమీ శశికళను కాపాడలేకపోయాయి. తాజాగా ఆమె పేరిట ఉన్న రూ.100 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ సీజ్ చేయడం గమనార్హం. ఈ ఆస్తులు కూడా జయ సీఎంగా ఉన్న సమయంలో శశికళ కొనుగోలు చేసినవే. మరి జయపై నమోదైన కేసులు, శశికళకు శిక్ష పడేందుకు కారణమైన కేసుల్లో ఈ ఆస్తుల జాబితా ఉందా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు. మొత్తంగా కోర్టు విధించిన శిక్షను అనుభవించి బయటకు వచ్చాక కూడా శశికళకు వరుస షాకులు తగులుతుండటం గమనార్హం.
Must Read ;- ఫైర్ బ్రాండ్ ‘తలైవి’లో జయ ఫైర్ ఉంటుందా?