Cinema Online Ticket Booking Cash Will Now Go To The AP Treasury :
తెలుగు సినిమా రంగం టాలీవుడ్ కు ఇదో భారీ దెబ్బేనని చెప్పాలి. కరోనా కలకలం నేపథ్యంలో సినిమా రంగం బక్కచిక్కిపోయింది. సినిమాలు తీయలేక.. ఎలాగోలా తీసిన సినిమాలను రిలీజ్ చేసుకోలేక.. రిలీజ్ కు సిద్ధమైన సినిమాలకు థియేటర్లు లేక.. అరకొరగా ఉన్న థియేటర్లలోనైనా విడుదల చేద్దామంటే టికెట్ల రేట్లు పెంచుకోలేక నానా కష్టాలు పడుతున్న సినిమా రంగానికి ఇది నిజంగానే భారీ దెబ్బ కిందే లెక్క. సినిమా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ను ఇప్పుడు ఏపీ సర్కారు తన చేతుల్లోకి తీసుకుంది. ఈ తరహా సరికొత్తగా దెబ్బ కొట్టిన జగన్ సర్కారుకు సహకరించిన వారెవరన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.
డబ్బంతా ఏపీ ఖజానాలోకే..
సినిమా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ వ్యవహారం మొత్తం ఏపీ సర్కారు పరిధిలోకి వెళ్లేలా జగన్ సర్కారు బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ద్వారా వచ్చే సొమ్ము మొత్తం నేరుగా ఏపీ ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లిపోతుంది. పన్నులు, ఇతరత్రా సుంకాలు తీసేసుకున్న తర్వాత.. ఏపీ సర్కారు మిగిలిన సొమ్మునే సినిమా డిస్ట్రిబ్యూటర్లకో, లేదంటే.. థియేటర్ల యాజమాన్యాలకో అందజేస్తుందట. ఇందుకోసం త్వరలోనే ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. రైల్వే ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో పోర్టల్ అభివృద్ది చేయబోతున్నట్టు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. ఈ వ్యవహారాలను రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించిన విధివిధానాలు, అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించే కమిటీ చూసుకుంటుందని చెప్పింది. ఇలా టికెట్ల డబ్బులన్నీ ప్రభుత్వ ఖజానాకు వెళ్లాక పన్నులన్నీ పిండేశాక మిగిలిన దానిని సినీ జనాలకు విడుదల చేస్తారు. పంపిణీ నెలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుందట. అంటే.. తమ సొమ్ముల కోసం సినిమా జనాలు కూడా ఇక జగన్ సర్కారు చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందేనన్న మాట. అంటే.. ప్రభుత్వ పనులను చేసిన కాంట్రాక్టర్ల మాదిరిగా జగన్ సర్కారు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి సినిమా జనాలు తిరగాలన్న మాట.
సమస్యలు తీర్చమంటే ఇలా చేశారే
కరోనా నేపథ్యంలో ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న సినిమా రంగాన్ని గట్టెక్కించేలా టికెట్ రేట్లను పెంచడమన్న ప్రధాన డిమాండ్ తో పలు ఇతర డిమాండ్లను చేతబట్టుకుని జగన్ ఆపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ తో అమరావతిలో ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యారు. అయితే ఆ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోగా.. మరో దఫా చర్చిద్దామంటూ జగన్ చెప్పారు. మలి భేటీ కోసం సినిమా జనాలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మొన్నామధ్య జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చారని, జగన్ తో ఏఏ అంశాలపై చర్చించాలన్న విషయంపై ఓ ప్రణాళికను రూపొందించుకునేందుకు మాట్లాడుకుందాం రమ్మంటూ చిరంజీవి ఇచ్చిన పిలుపు మేరకు చిరు నివాసంలోనే చాలా మంది సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. అయితే ఆ సమావేశం తర్వాత జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి రద్దు చేసేశారు. తీరా ఆయనతో భేటీ సాధ్యం కాలేదు గానీ.. సినిమా ఆన్ లైట్ టికెట్ బుకింగ్ మొత్తం జగన్ సర్కారు చేతిలోకి వెళ్లిపోయింది. ఈ పరిస్థితిపై ఇప్పుడు సినిమా జనాల్లో ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్లిపోగా.. జనం మాత్రం ఈ తరహా నిర్ణయంపై ఇటు జగన్ సర్కారుతో పాటు అటు చిరు, ఇతర సినీ పెద్దలపై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.
Must Read ;- సినిమాకు చేవ.. నిర్మాతకు రొక్కం..!











