తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన తరువాత చిన్నమ్మ వీకే శశికళ నటరాజన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పిన వీకే శశికళ కుటుంబ సభ్యులు ప్రస్తుతం అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. జయలలిత మరణించిన తరువాత శశికళ అవినీతి ఆరోపణలపై జైలుపాలయ్యారు. శశికళ కుటుంబ సభ్యులు అన్నాడీఎంకే పార్టీ మీద పెత్తనం చెలాయించే సమయంలో వారు మన్నార్ గుడి ఫ్యామిలీగా ప్రసిద్ధి కెక్కారు. తరువాత శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ అన్నాడీఎంకేను వీడి సొంత పార్టీ పెట్టడంతో శశికళ ఫ్యామిలీ చీలిపోయింది. శశికళ సొంత సోదరుడు దివాకరన్ ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడి చెన్నైలోని ప్రేవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. దీంతో చిన్నమ్మ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
దినకరన్ పార్టీ పెట్టడంతో..
దినకరన్ పార్టీ పెట్టిన తరువాత అతని మేనత్త శశికళ ఎలా చెబితే అలా నడుచుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని శశికళ సొంత సోదరుడు దివాకరన్ అక్క శశికళకు దూరం అయ్యాడు. జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన శశికళను కుటుంబ గొడవల కారణంగా ఇంతవరకు దివాకరన్ ఒక్కసారి కూడా కలవలేదు. తిరువళ్లూరులోని సుందరకోటైలో నివాసం ఉంటున్న దివాకరన్ అనారోగ్యానికి గురి కావడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయన కరోనా బారిన పడటంతో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
Must Read ;- మళ్లీ రాజకీయాల్లోకి వస్తా.. ధైర్యంగా ఉండండి : శశికళ










