స్వాతంత్ర్యానికి పూర్వం.. జైలు కెళ్లిన నేతలకు ప్రజల్లో మంచి ఆదరణ లభించేది. విపరీతమైన గౌరవం దక్కేది. పోరాట యోధులుగా పేరొచ్చేది. విడుదలయ్యాక.. వారిని చూసేందుకు జనం ఎగబడేవారు. ప్రేమాభిమానాలను కురిపించేవారు. ఊరేగింపుగా తీసుకెళ్లేవారు. ఆ తర్వాత కాలంలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వారికి ఆ గౌరవం దక్కేది. మరి ఇప్పుడో..! ఆర్థిక నేరాల్లో, అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో జైలు కెళ్లిన, శిక్ష అనుభవించి వచ్చిన రాజకీయ నేతలకు అదే గౌరవం దక్కుతోంది.
లాలూతో మొదలు..
ఇలాంటి పరిస్థితులకు ఆద్యుడు లాలూ ప్రసాద్ యాదవ్ అనే చెప్పుకోవచ్చు. 90వ దశకంలో బిహార్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన తొలిసారిగా జైలు గోడల మధ్య గడిపారు. పశుగ్రాసం కుంభకోణంలో ఆ రోజున ఆయన జైలుకెళ్లారు. అనంతరం బెయిలుపై విడుదలైనప్పుడు జైలు నుంచి ఇంటి వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. స్వయంగా ఆయన అంబారీపై ఎక్కి ఊరేగుతూ ఇళ్లు చేరారు. అప్పట్లో అది సంచలనమైంది. ఆ తర్వాత కాలంలో జయలలిత జైలుకెళ్లినా.. ఆమె ఇలాంటి హంగామాలకు దూరంగా ఉందనే చెప్పొచ్చు.
జగన్ హడావుడి అంతా ఇంతా కాదు..!
ఈ సంస్కృతిని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిన ఘనత మాత్రం ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కే దక్కుతుంది. 43 వేల కోట్ల రూపాయల తీవ్రమైన ఆర్థిక నేరాల్లో అభియోగాలు ఎదుర్కొని 16 నెలలు జైల్లో గడిపొచ్చిన జగన్.. చంచల్ గూడ జైలు నుంచి లోటస్ పాండ్ వరకు తీసిన భారీ ర్యాలీ.. అప్పట్లో చర్చనీయాంశమైంది.
అదే బాటలో పయనించిన శశికళ
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చిన శశికళ.. బెంగుళూరు నుంచి చెన్నై వరకు తీసిన ర్యాలీ.. నభూతో నభవిష్యత్. ఐదు గంటల ప్రయాణానికి 23 గంటలు పట్టిందంటేనే అర్థం చేసుకోవచ్చు.. అది ఎంత భారీస్థాయిలో జరిగిందో. బెంగళూరు నుంచి దాదాపు వంద కార్లతో ఆమె అనుచరులు భారీ ర్యాలీగా వెంటరాగా.. శశికళ తమిళనాడుకు వెళ్లారు. పూర్ణ కుంభ స్వాగతాలు, అడుగడుగునా పూలజల్లులు. దారి పొడవునా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కార్యకర్తలు, అభిమానులు శశికళ కారును అడ్డుకుని మంగళహారతులు ఇచ్చారు. ఓ అంచనా ప్రకారం ఈ స్వాగత కార్యక్రమానికి దాదాపు రూ.200 కోట్లు ఖర్చయింది. అంటే.. గంటకు రూ.8.60 కోట్ల పైమాటే. కోట్ల రూపాయల పూలు రహదారులపై వెదజల్లారు. హెలికాఫ్టర్ నుంచి పూల వర్షం కురిపించాలని భావించినప్పటికీ కుదరలేదు. ఆ ఒక్కటి మినహా చిన్నమ్మ స్వాగతానికి పెట్టిన ఖర్చు ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశమైంది.
బలం నిరూపించుకోవాడికేనా..
శశికళ తమ బలాన్ని చాటి చెప్పుకునేందుకే ఇంత ఖర్చు చేసి హడావిడి చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శశికళ తమిళనాడు ఎంట్రీ ఒక రోడ్‌షోను తలపించినప్పటికీ అన్నాడీఎంకే నేతల నుంచి ఆశించిన స్పందన రాకపోవడం గమనార్హం. ఆమె తమిళనాడు రాగానే.. పెద్ద ఎత్తును అన్నాడీఎంకే నుంచి వలసలు ఉంటాయన్న ప్రచారం జోరుగా సాగింది. శశికళ వర్గం కూడా అదే ఆశించింది. కానీ.. అన్నాడీఎంకే కీలక నేతలెవరకూ శశికళ క్యాంపు వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
ఇలా.. అవినీతి పరులందరూ జైలు నుంచి బయటకు వస్తూ భారీ ర్యాలీలు తీస్తుండడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుబడుతున్నారు. జనం నవ్వుతారేమోనన్న భావన కూడా లేకుండా నిస్సిగ్గుగా ఇలా వ్యవహరిస్తుండడం దారణమని వ్యాఖ్యానిస్తున్నారు. వీళ్లేమైనా దేశం కోసం పోరాడి జైలుకెళ్లారా? జనం సొమ్ము దిగమింగి వెళ్లారు. ఇలాంటి నేతలు విచ్చలవిడిగా వ్యవహరిస్తుంటే.. అడిగేవారే లేరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో కోర్టులైనా జోక్యం చేసుకుని, మళ్లీ మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Must Read ;- రజినీని ఎవరు శాసించారు? ఎందుకు పాటించారు?