ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు వేయలేకపోయిన వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశం ఇస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు ఈ నెల 20లోపు ఇటువంటి నామినేషన్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని నిమ్మగడ్డ ఆదేశించారు. కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ పేర్కొన్నారు. నామినేషన్లు అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదు కాపీలను కూడా ఇవ్వాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఫిర్యాదులు చేయకపోయినా, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనతో స్పష్టం చేసింది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లోనూ..
బెదిరింపుల కారణంగా మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయలేని వారికి తిరిగి అవకాశం కల్పించాలని ఎస్ఈసీ భావించారు. అందుకు అనుగుణంగా గుంటూరు జిల్లాలోని మాచర్ల, కడప జిల్లాలోని పులివెందుల, రాయచోటి, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, తిరుపతి నగర పాలక సంస్థలో సమర్పించిన సింగిల్ నామినేషన్లపై రిటర్నింగ్ అధికారులను రమేశ్ కుమార్ నివేదిక కోరారు. ఈనెల 20 లోపు పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. బెదిరించారని రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసుంటే ఆ వార్డుల్లో నామినేషన్లు తీసుకోవాలని ఎస్ఈసీ సూచించారు. బెదిరింపులపై మీడియాలో వచ్చిన వార్తలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. ఆయా రాజకీయ పక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రమేశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Must Read ;- ఏకగ్రీవాలు విత్ హెల్డ్.. ఫిర్యాదులపై ఎస్ఈసీ విచారణ











