ఏపీలో కరోనా కారణంగా గత ఏడాది మార్చి 14న నిలిచిపోయిన పురపాలికలు, నగర పాలక సంస్థల ఎన్నికలు మార్చి 10న నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, గతంలో నామినేషన్ల ప్రక్రియలో అధికార వైసీపీ నేతలు తీవ్ర అరాచకాలకు పాల్పడ్డారనే విమర్శలు వచ్చాయి. కొన్ని మున్సిపాలిటీల్లో ప్రతిపక్ష టీడీపీ నేతలను కనీసం నామినేషన్లు కూడా వేయనీయలేదు. అధికార వైసీపీ మినహా అన్ని పక్షాలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల కమిషనర్‌కు విజ్ఙప్తి చేసినా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మాచర్లలో జరిగిన అధికార పార్టీ అరాచకాలు కళ్ల ముందే మీడియాలో కనిపిస్తున్నా పాత షెడ్యూల్ కొనసాగించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.
అరాచకాలు అడ్డుకోరా..?
గత ఏడాది మార్చిలో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికార పార్టీ నేతల అరాచకాలు అడ్డుకోవడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా విఫలమైందనే విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు మాచర్ల లాంటి మున్సిపాలిటీల్లో కనీసం నామినేషన్లు కూడా వేయలేకపోయారు. అధికార పార్టీ నేతలకు పోలీసుల అండ కూడా తోడు కావడంతో వారు చెలరేగిపోయారు. అలాంటి ప్రాంతాల్లో గత నామినేషన్లను ఉపసంహరించి, కొత్తగా నామినేషన్లు స్వీకరిస్తారని అందరూ భావించారు. తాజా నోటిఫికేషన్ పరిశీలిస్తే… కొత్తగా నామినేషన్ల ప్రక్రియ లేనట్టు కనిపిస్తోంది. నామినేషన్ల ఉపసంహణ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే అధికార వైసీపీ అరాచకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అధికార ముద్ర వేసినట్టేనని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
Must Read ;- ఏపీలో మున్సిపాలిటీ ఎన్నికలు కంటిన్యూ..
మిగిలినవాటి పరిస్థితి ఏమిటి
ఏపీలో మొత్తం 104 మున్సిపాలిటీలు, 15 కార్పొరేషన్లు ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 75 పురపాలికలు, 12 నగరపాలక సంస్థలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్‌ఈసీ ప్రకటించింది. మిలిగిన 29 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లకు ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. 29 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల ఎన్నికలపై కోర్టులో కేసులు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇక ప్రస్తుతం జరుగుతున్న 75 మున్సిపాలిటీల్లోనూ గత ఏడాది నామినేషన్ల పర్వంలోనే అధికార వైసీపీ అనేక బెదిరింపులు, దాడులకు దిగింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు కొన్ని మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు. అలాంటి ప్రాంతాల్లో వైసీపీ ఏక పక్షంగా గెలిచే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు కనీసం పోటీ చేసే అవకాశం కూడా లేకుండా పోయినట్టవుతుంది. ఇలా ఎన్నికల్లో పారదర్శకత లేకుండా హడావుడిగా పూర్తి చేయాలనే ప్రయత్నాలను టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
జడ్పీ, ఎంపీటీసీలు లేనట్టే..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మార్చి 31తో ముగిసిపోతుంది. మార్చి 14 వరకు ఎన్నికల ప్రక్రియను ప్రకటించారు. ఆ తరవాత ఆయనకు ఉండే పదవీ కాలం కేవలం 16 రోజులు మాత్రమే. ఆ సమయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి చేయడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే హడావుడిగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నోటిఫికేషన్ విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం మిగిలిపోయిన అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినా పట్టించుకోలేదు. అంటే మొత్తం ఎన్నికలు ఒకసారి నిర్వహించే ఆలోచన ఎస్‌ఈసీకి లేదని తెలుస్తోంది. ఇక మిగిలిపోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కొత్తగా వచ్చే ఎన్నికల కమిషనర్ నిర్వహించే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్‌లోనూ ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా పాత ఎన్నికల షెడ్యూల్ కొనసాగింపుపై ప్రతిపక్ష పార్టీల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
Must Read ;- మరో ఎన్నికలకు నగరా.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వేడి