ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. జగన్ మోహన్‌రెడ్డి సర్కారు… ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య పెద్ద యుద్ధంలానే మారిపోయిన ఈ వ్యవహారంపై విచారణ ముగిసిందని ప్రకటించిన హైకోర్టు తీర్పును మాత్రం రిజర్వ్‌లో పెట్టేసింది. అయితే, ఈ కేసులో తమనూ కూడా ఇంప్లీడ్ చేసుకోవాలంటూ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ మాత్రం హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్‌ను కొట్టేస్తూ కోర్టు నిర్ణయం తీసుకున్న దరిమిలా… తుది తీర్పు ఎస్ఈసీ నిమ్మగడ్డకే అనుకూలంగా రానుందా? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసిందనే చెప్పాలి.
విచారణ ముగిసిందన్న హైకోర్టు
ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మొన్నామధ్య ఎట్టకేలకు రంగం సిద్ధం కాగా… కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఎన్నికల నిర్వహణకు ఉపక్రమించారు. ఈ క్రమంలో వచ్చే నెలలో ఎన్నికల నిర్వహణకు ఆయన షెడ్యూల్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ వేస్తున్న క్రమంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ నిమ్మగడ్డ నిర్ణయాన్ని జగన్ సర్కారు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వివాదం హైకోర్టు మెట్కెక్కగా… కోర్టు ఇదివరకే రెండు పర్యాయాలు విచారణ చేపట్టింది. తాజాగా మంగళవారం కూడా హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. అంతేకాకుండా ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు… ఈ వివాదంపై విచారణ ముగిసిందని, ఇక తీర్పు చెప్పడమే తరువాయి అని ప్రకటించింది. అయితే, తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు… ఈ ప్రతిష్టంభనకు ముగింపు పలకలేదనే చెప్పాలి.
Must Read ;- ఉద్యోగులకు సంఘాలా.. సర్కారుకు బాకాలా!

మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా ఎస్ఈసీ తరఫు వాదనలతో పాటు జగన్ సర్కారు వాదనలను కూడా కోర్టు ఆలకించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తరుపున కోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణ రావు… ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అందులో జోక్యానికి తావు లేదన్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను నిలిపి వేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్… కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన వివరాలను ఎన్నికల కమిషనర్ పరిగణలోకి తీసుకోలేదన్నారు. వ్యాక్సినేషన్,ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించడం సాధ్యం కాదన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
వ్యతిరేకించిన ఉద్యోగ సంఘాలు
ఇదిలా ఉంటే… స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అటు ప్రభుత్వం ఓ వైపు నిలవగా… ఇంకోవైపు ఎస్ఈసీ నిలిచినట్లైంది. తాను చెప్పిన మాట మేరకు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేని ఎస్ఈసీపై తనదైన శైలిలో ద్వేశపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్న జగన్ సర్కారు… ఉద్యోగులను మొత్తంగా తన వైపునకు తిప్పేసుకుంది. ఈ క్రమంలో ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఇచ్చిన షెడ్యూల్‌ను ఉద్యోగ సంఘాలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఇప్పటిదాకా ఉద్యోగ సంఘాలు ఈ వివాదానికి సంబంధించి కోర్టులో జరుగుతున్న విచారణలో మాత్రం జోక్యం చేసుకోలేదు. మంగళవారం నాటి విచారణ సందర్భంగా తమను కూడా ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను కోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అంతేకాకుండా ఎస్ఈసీ, జగన్ సర్కారు వాదనలకు ఫుల్‌స్టాప్ పెట్టేసినట్టుగా ప్రకటించేసిన కోర్టు… తుది తీర్పును త్వరలోనే ప్రకటించనున్నట్లుగా చెప్పేసింది. ఈ పరిణామాలను చూస్తుంటే… ఎస్ఈసీ వాదనలకు అనుకూలంగానే కోర్టు తీర్పు వెలువడవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి తొలగింపు.. ఎస్‌ఈసీ సంచలన నిర్ణయం











