ముందు బకాయిలు చెల్లించండి!
జగన్ రెడ్డి ప్రభుత్వానికి విద్యుదుత్పత్తి సంస్థలు షాక్ ఇచ్చాయి. బకాయిలు చెల్లింపుల్లో ఏపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఎన్టీపీసీకి సకాలంలో డబ్బులు చెల్లించలేక చేతులెత్తేసింది. దీంతో రాష్ట్రానికి సరఫరా చేస్తున్న 2 వేల మోగావాట్లను ఎన్టీపీసీ అర్ధాంతరంగా ఆపేసింది. గడిచిన రెండు రోజులుగా ఏపీలోని పలు జిల్లాలు అంధకారంలో మగ్గుతున్నాయి. రాత్రి, పగలు అని తేడాలేకుండా గంటలకొద్ది విద్యుత్ కోతలను విధించి సరఫరా నిలిపివేస్తున్నారు. కర్నూల్, ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలో విద్యుత్ కోతలు రెండురోజులుగా ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. భవిష్యత్తులో కోతలు ఇంకా తీవ్రతరం అయ్యేలా కనిపిస్తున్నాయే తప్ప.. పరిష్కారం వైపు జగన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఏమీ కనిపించడంలేదు అన్నది వాస్తవ పరిస్థితి!
తీవ్ర బొగ్గు కొరత ..
రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు( ఆర్టీపీపీ ) లోని మరో యూనిట్ లో విద్యుదుత్పత్తి ప్రారంభించాలంటూ ఇంధన శాఖ ఆదేశించింది. అయితే తమ వద్ద బొగ్గులేదని, బొగ్గు కొనుగోలుకు నిధులు విడుదల చేయకుంటే ఏం చేయాలని ఆర్టీపీపీ చేతులెత్తేసింది. మరోవైపు కృష్ణపట్నంలో ఒక యూనిట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో 810 మోగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ కూడా కేవలం 5 రోజులకు సరిపడా ( 80 వేల మెట్రిక్ టన్నులు ) బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లపై ఆధారపడుతూ సొంత విద్యుదుత్పత్తి సంస్థల్లో ఉత్పత్తిని నిలిపివేస్తే ఇలాంటి సమస్యలే ఎదురువుతాయని నిపుణులు విమర్శిస్తున్నారు.










