ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తన సొంత ప్రాంతమైన ఇడుపులపాయలో ఊహించని షాక్ తగిలింది. ఇడుపులపాయాలోని గ్రామ సచివాలయానికి జగన్ సొంత పార్టీ నేతలె తాళం వేశారు.అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న వాగ్వివాదమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. జగన్ సొంత జిల్లాలోనే ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆ పార్టీ నేతల్లో కలకలం రేపుతోంది.
ఇడుపులపాయలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటుకు సంబంధించి గ్రామ వైసీపీ శాఖలోని రెండు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి.స్థానిక గ్రామ సచివాలయం సమీపంలోనే ఆర్బీకేను ఏర్పాటు చేయాలని ఓ వర్గం వాదించింది. అయితే ఆ ప్రాంతం మొత్తం వర్షం పడితే నీట మునుగుతుందని, అలాంటి ప్రాంతంలో ఆర్బీకే ఏర్పాటు వద్దని ఇంకో వర్గం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది.దీంతో ఇరువర్గాల మధ్య ఏర్పడిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఒకానొక దశలో రెండు వర్గాలు ఒకరిపై మరొకరు పరస్పరం దాడి చేసుకునే వరకు వెళ్లారు.
వాస్తవానికి గ్రామంలో వైసీపీ ఇటీవల రెండు వర్గాలు చీలిపోగా.. ఓ వర్గానికి చెందిన వైసీపీ శ్రేణులు గ్రామ సచివాలయానికి తాళం వేసి అక్కడే ఆందోళనకు దిగారు. కాగా, వారి ప్రత్యర్థి వర్గం వారితో వాదులాటకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.దీంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.