( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
రెవెన్యూ చట్టాల్లోని లొసుగులు తమకు అనుకూలంగా మలుచుకున్న అధికారులపై చర్యలకు విశాఖలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సిఫార్సు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే కనుక జరిగితే ఎందరో రెవెన్యూ అధికారుల మెడకు ఉచ్చు బిగుసుకోనుంది.
రాష్ట్రంలోని భూములు ఆన్‌లైన్ చేసే క్రమంలో అనేక అవకతవకలు జరిగాయి. అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములుగా… విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములుగా మారిపోయాయి. భూముల్లో మార్పులు చేర్పులు చేసే అధికారం తహసీల్దార్‌లకు అప్పటి ప్రభుత్వం అప్పగించింది. ప్రత్యేక పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యి భూములు స్వరూపం మార్చే అధికారం వాళ్ళ చేతుల్లోకి వెళ్లింది. సరిగ్గా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని ఎమ్మార్వోలు ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి కోట్ల రూపాయలు ఆర్జించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.
Also Read ;- విశాఖలో వింత దోపిడీ సంస్కృతి
సెక్షన్ 22 ఎ మాయాజాలం..
ఇదే కోవలో రెవెన్యూ అధికారుల మరో మాయాజాలం సెక్షన్ 22 ఎ. రెవెన్యూలోని ఈ సెక్షన్ తమకు అనుకూలంగా మార్చుకొని, అనేక జిరాయితీ భూములను ఈ సెక్షన్ పరిధిలోకి మార్చేశారు. ఈ కారణంగా ఆయా భూములు కొన్నేళ్లుగా చిక్కుల్లో పడ్డాయి. ప్రైవేటు వ్యక్తుల నుంచి భారీగా దండుకునేందుకు ఎటువంటి వివాదాలు లేని భూములను సైతం ఈ సెక్షన్ పరిధిలో చేర్చారు. 22 ఏ నుంచి ఆయా భూములను తొలగించుకునేందుకు చేతులు తడపందే పనులు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఆర్థికంగా ఉన్న వాళ్లు ఈ గండం నుంచి గట్టెక్కినా , సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాత్రం నేటికీ ప్రభుత్వం నుంచి ఉపశమనం కోసం ఎదురు చూస్తున్నారు. అనేక ఈనామ్ భూములను సైతం ఈ జాబితాలో చేర్చారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనకాపల్లి ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు 22 ఏ పరిధిలోకి చేర్చారని, వాటిని తొలగించాలని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకుడు దాడి వీరభద్రరావు పలుమార్లు స్పందనలో వినతులు సమర్పించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : సిట్
22 ఏ జాబితాలో ఉన్న భూముల విషయంలో గత ప్రభుత్వ హయాంలో భూముల కుంభకోణంపై వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కు సుమారు 290 ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన బృందం ఫిర్యాదుదారుల్లో అనేకమందికి రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉండడాన్ని గుర్తించింది. ఆ సమయంలో ఆ జాబితాలో లేని భూములు… ఉన్నఫలంగా ఎలా మారాయి? అందుకు బాధ్యులెవరు? అధికారులు చేసిన తప్పిదానికి సామాన్యుడు ఎందుకు అవస్థలు పడాలి? ఇటువంటి సమస్యలను తక్షణం పరిష్కరించాలని అభిప్రాయపడింది. అంతేకాకుండా అందుకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానా విధించాలని మరికొద్ది రోజుల్లో సమర్పించనున్న వేదికలలోనూ పొందుపరిచినట్లు తెలుస్తోంది.
Must Read ;- గీత దాటితే కఠిన చర్యలు.. కరణం, ఆమంచికి వైసీపీ అధిష్టానం ఫోన్;!











