విజయశాంతి పార్టీ మారుతున్నట్లు ఎప్పటి నుంచో వస్తున్న వార్తలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అయిన విజయశాంతి బీజేపీలోకి చేరడానికి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో రేపు ఆమె పార్టీ మారనున్నట్లు తెలిసింది. అనంతరం ఆమె పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారానికి ఆదివారం చివరి రోజు. ఆదివారం సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈక్రమంలో విజయశాంతితో పార్టీ బలహీనంగా ఉన్న డివిజన్లలో ప్రచారం చేపించేందుకు ప్రణాళిక సిద్దం చేశారట. చివరి రోజు కావడంతో వీలైన్నీ ఎక్కువ డివిజన్లను కవర్ చేసేలా ఈమేరకు ముందస్తు వ్యూహం రచించారట.
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గత కొన్ని రోజులుగా పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే పార్టీలోకి ఆహ్వానిస్తు బీజేపీ నాయకులు కొందరు ఆమెతో భేటీలు కూడా జరిపారు. ఆమె సైతం ఈ మధ్య ఢిల్లీకి వెళ్లి జాతీయ నాయకత్వంతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా జేపీ నడ్డా శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఆదివారం ఆయన సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకొని ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని టీఆర్ఎస్‌పై నిప్పులు చెరగనున్నారు.
గత కొంత కాలంగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. కొందరు నాయకుల తీరుపై ఆమె అసంతృప్తిగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ తీర్థం పుచ్చుకోనప్పటికినీ సోషల్ మీడియా వేదికగా బీజేపీకి అనుకూలంగానూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేస్తూ యాక్టివ్ పాలిటిక్స్‌లో తానూ ఉన్నాననే సంకేతాలను ఎప్పటికప్పుడు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె పార్టీ మారే విషయంలో రాజకీయ వర్గాల్లోనూ ఒకానొక దశలో స్పష్టత కొరవడింది. ఈ మొత్తం ఎపిసోడ్‌కి పుల్‌స్టాప్ పెడుతూ ఆమె రేపు బీజేపీలోకి జాయిన్ అవ్వబోతుంది.
Must Read ;- బీజేపీని గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ రద్దు.. ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ!











