నా అసలు రాదారి ఇదేనంటున్నారు ప్రజల హీరో సోనూ సూద్. మరి ఆ రహదారి మీద ఆయనకు ఎందుకంత ప్రేమో తెలుసుకుందాం. ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అంటారు పెద్దలు. కాలం తల్లిని తనలో కలిపేసుకున్నా ఊరు మాత్రం అలానే ఉంటుంది. తల్లి జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉంటాయి.
పంజాబ్ లోని ఓ ప్రధాన నగరం మోగాలోతన తల్లి జ్ఞాపకాలను తనలోనే పదిల పరచుకున్నారు సోనూ సూద్. ఎందుకంటే అదే అతని సొంతూరు మరి. తెరపై విలన్ అయినా ప్రజల దృష్టిలో రియల్ హీరోగా గుర్తింపును పొందిన సోనూ తన తల్లి జ్ఞాపక చిహ్నంగా ఓ రోడ్డును సాధించుకున్నారు. ఆయన తల్లి పేరు సరోజ్ సూద్. ప్రొఫెసర్ సరోజ్ సూద్ రోడ్ పేరుతో రోడ్డు, అక్కడ శిలాఫలకం చూసి భావోద్వేగానికి గురయ్యారు సోనూ సూద్.
గుడిలో కన్నా సోనూ ముందు తమ గోడు వెళ్లబోసుకుంటే ఆయన వెంటనే కరుణించేస్తున్నాడు. జనం కూడా ఆయనను మెసయ్యగా చూస్తున్నారు. ఓ దేవుడిలానే ఆరాధిస్తున్నారు. అయినా ఆయన దాన్ని అంగీకరించకపోవడం ఆయన గొప్పతనం. ‘ఐయామ్ నో మెసయ్య’ పేరుతో ఓ పుస్తకం కూడా రాసేశారు. ఆ పాత ఇల్లు ఇప్పుడు సర్వాంగ సుందరంగా మారింది.
అమ్మ నడిచిన బాటలోనే..
ఎవరినైనా ఆదుకోవాలనే తనలోని దాన గుణం అమ్మ నుంచే వచ్చిందంటారు సోనూ సూద్. అమ్మ నడిచిన బాటలోనే నడుస్తున్నానంటారు. అమ్మ ఏ రోడ్డు మీద తన జీవితకాలం ప్రయాణించిందో ఆ రోడ్డుకు ఆమె పేరు పెట్టడం తెలిసి స్వర్గంలో ఉన్న తన తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారంటున్నారు సోనూ. ‘ఈ ప్రపంచంలో తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశం `ప్రొఫెసర్ సరోజ్ సూద్ రోడ్.. ఇది నా విజయ మార్గం’ అంటూ భావోద్వేగానికి ఆయన లోనయ్యారు.
దీన్ని సాధించిన హర్జోట్ కమల్, సందీప్ హాన్స్, అనితా దర్శిలకూ, ప్రభుత్వానికీ రుణపడి ఉంటానన్నారు. ఈ రోడ్డు మీద నిలబడి ఓ వీడియోను కూడా ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. తన జీవితంలో ఇది ముఖ్యమైన ఘట్టమన్నారు. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి హ్యుమానిటేరియన్ అవార్డుతోపాటు ఎన్నెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆయనను వరించాయి.
సోనూ అమ్మానాన్నల గురించి..
సోనూ సూద్ తండ్రి శక్తి సాగర్ సూద్ ఓ ఎంటర్ ప్రెన్యూర్. తల్లి సరోజ్ సూద్ టీచర్. సోనూకు ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. అక్క మోనికా సూద్ సైంటిస్టు. చెల్లి పేరు మాళవికా సచార్. సోనూ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగులో డిగ్రీ పూర్తి చేశాక నటన వైపుగా అడుగులు వేశారు. సోనూ భార్య పేరు సోనాలి సూద్. వీరికి ఇద్దరు కుమారులు.ఇషాంత్, అయాన్ వారి పేర్లు. క్లుప్తంగా ఇదీ సూనూ గురించి. 2016లోనే సోనూ తండ్రి మరణించారు. అప్పటికి నాలుగేళ్లుగా ఆయన శ్వసకోశ సమస్యతో బాధపడ్డారు. చివరికి గుండెపోటుతో మరణించారు. అప్పటికి ఎనిమిదేళ్ల క్రితమే తల్లి సరోజా సూద్ మరణించారు.
Must Read ;- సోనూ సూద్ కుట్టు మిషన్ కథేంటో తెలుసా?
తన తల్లి కలను నెరవేర్చడానికి సోనూ సూద్ మోగాలోని వారి పూర్వికుల ఇంటిని పునర్మించే ప్రయత్నాలు చేశారు. సోనూ జ్ఞాపకాలన్నీ ఆ ఊరితోనే పెనవేసుకు పోయాయి. అమ్మను ఎంతగా ప్రేమించాడో, తన సొంతూరినీ అంతగా ప్రేమించాడు సోనూ. సోనూ ఇలా సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారని బురద జల్లే వారూ ఉన్నారు. ఇప్పటిదాకా తనకు రాజకీయాల వైపు వెళ్లాలన్న ఆలోచనే లేదని సోనూ స్పష్టం చేశారు. భవిష్యత్తు గురించి ఎవరూ చెప్పలేరు.
– హేమసుందర్ పామర్తి