(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ప్రోత్సాహంతో దూకుడుగా వ్యవహరిస్తున్న మంత్రి అప్పలరాజు టీడీపీ కబ్జాలను వెలికి తీసే క్రమంలో నోరు జారడంతో ఇరుకున పడ్డారు. ఇదే అదునుగా గౌతు లచ్చన్న పేరిట బీసీ అస్త్రంతో టీడీపీ బాణం సంధించేందుకు రెడీ అయింది. దీంతో మంత్రికి పొలిటికల్ మైలేజ్ మాట దేముడెరుగు బీసీలను వైసీపీకు వ్యతిరేకంగా చేస్తున్నారన్న నింద మూటగట్టుకునే పరిస్థితి దాపురించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు చెందిన మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ విషయంలో మౌనం దాల్చడం సీదిరికి బాగా మైనస్ అయినట్లు తెలుస్తోంది. ఇంకో వైపు జిల్లాలో కబ్జాల బాగోతాలు వెనక్కు పోయాయి. ఇపుడు గౌతు లచ్చన్న ఆయుధంతో టీడీపీ ముందుకు వస్తూంటే లాక్కోలేక పీక్కోలేక మంత్రి గారు తెగ సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయిన అప్పలరాజుకు ఇపుడు టీడీపీ పట్టపగలు చుక్కలు చూపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
బీసీల దేవుడు .. లచ్చన్న
శ్రీకాకుళం జిల్లాలో, ఆ మాటకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు తమ దేవుడుగా సర్దార్ గౌతు లచ్చన్నను భావించిన పరిస్థితులు ఉన్నాయి. అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన లచ్చన్న అంచెలంచెలుగా ఎదిగి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే నాయకుని స్థాయికి చేరుకున్నారు. ఆయన ఎపుడూ అధికార పార్టీల విధానాలనే విమర్శించేవారు. జీవితం మొత్తం బడుగు, బలహీనుల కోసం అంకితం చేసిన నేత లచ్చన్న. అటువంటి లచ్చన్న మరణించి చాలా కాలమే అయినప్పటికీ ఆయన్ని అంతా బీసీ నేతగా కొలుస్తారు. ఆయన విగ్రహాన్ని కూలదోస్తామనడంతో మంత్రి సీదిరి ఇరకాటంలో పడ్డారు. ఇదే అదునుగా ఆయన మాటలు వాడుకోవడం ద్వారా టీడీపీ అసలైన రాజకీయ క్రీడ ప్రారంభించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Must Read ;- ప్రెస్ మీట్‌పై కౌంటర్ ఇస్తే ఆక్రమణలను రాత్రికి రాత్రే కూల్చేస్తా : మంత్రి సీదిరి

కబ్జాలపై కన్నెర్రతో..
రాష్ట్ర మంత్రి పదవి దక్కాక శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదరి అప్పలరాజు తన గేరు మార్చి స్పీడ్ పెంచారు. ఆయన రాష్ట్ర టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు జిల్లాలోని టీడీపీ నాయకులను టార్గెట్ చేశారు. భూ కబ్జాల విషయంలో జిల్లాలో మంత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అక్రమార్కుల భరతం పడతామని చెప్పడమే కాదు, గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే టీడీపీ నేతలు పాల్పడిన భూ దందాలను కూడా వెలికి తీస్తామని మంత్రి హెచ్చరించారు. ఈ క్రమంలో మంత్రి గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూడా అక్కడ తొలగిస్తామనడం టీడీపీకి అంది వచ్చిన అస్త్రమైంది. దాంతో గౌతు లచ్చన్న వంటి బీసీ నేతను అవమానిస్తారా అంటూ అచ్చెన్నాయుడుతో సహా టీడీపీ నేతలంతా మంత్రి అప్పలరాజు మీద హాట్ హాట్ విమర్శలు గుప్పించడం, పలాసలో నిరసనకు పూనుకోవడం ఉత్కంఠకు దారి తీసింది.
టీడీపీకి అందివచ్చిన బీసీ అస్త్రం
గౌతు లచ్చన్న ఎపుడూ అధికార పార్టీలో చేరలేదు. ఆయన విపక్షంలోనే కొనసాగారు. ఆయన తనయుడు గౌతు శ్యామసుందర శివాజీ, మనవరాలు గౌతు శిరీష టీడీపీలో ఉన్నారు. దాంతో ఇప్పుడు లచ్చన్నను టీడీపీ తమ వాడిగా చేసుకోవడంలో సఫలీకృతమైంది. దీంతో సిక్కోలులో బీసీల మధ్య చిచ్చు పెట్టేలా ఇది ఉందని అంటున్నారు. అచ్చెన్నాయుడు అయితే బీసీల మీద వైసీపీకి అసలు గౌరవం లేదని గట్టిగానే మాట్లాడారు. గౌతు లచ్చన్న వంటి బీసీ నేతల విగ్రహాల మీద చేయి వేస్తే ఏపీలో జగన్ సర్కార్ ఉండదని కూడా హెచ్చరించారు. దాంతో బీసీ కార్డుని వైసీపీ మీదకు ఎగదోసే సరికొత్త రాజకీయానికి టీడీపీ తెర లేపడంతో సిక్కోలు వైసీపీలో ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. దీని నుండి బయట పడేందుకు నానా తంటాలు పడుతోంది.
Also Read ;- వైసీపీ VS టీడీపీ.. పలాసలో రగులుతున్న కుల రాజకీయం











