విభిన్నమైన కథలతో వచ్చే సినిమాలకు తెలుగు ప్రేక్షకులు విజయాలను ముట్టజెబుతూనే వున్నారు. కథలో బలం .. కథనంలో పట్టు .. పాత్రలను నడిపించేతీరులో ఆసక్తి వుంటే చాలు ఆదరిస్తూనే వున్నారు. అలాంటి కోవలోనే రూపొందిన చిత్రంగా ‘గమనం‘ కనిపిస్తోంది. రమేశ్ కరుటూరి .. వెంకీ పుషడపు .. జ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మించిన ఈ సినిమాకి, లేడీ డైరెక్టర్ సుజనారావు దర్శకత్వం వహించారు. ఆకలి – ఆశ, ప్రేమ – పేదరికం, ఆశయం – ఆవేదన అనే మూడు కోణాల్లో ఆమె ఈ కథను ఆవిష్కరించినట్టు తెలుస్తోంది. వినికిడి లోపం కలిగిన స్త్రీ పాత్రలో ఈ సినిమాలో శ్రియ కనిపించనుంది.
సెకండాఫ్ లో వచ్చే వరద సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. స్లమ్ ఏరియాలోకి వర్షం కారణంగా వరద ప్రవేశించడం, ఆ వరదలో శ్రియ చిక్కుబడటం వంటి సన్నివేశాలను చిత్రీకరించినతీరు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని అంటున్నారు. సెకండాఫ్ లోనే మిగతా ముఖ్యమైన పాత్రల్లో అనూహ్యమైన మలుపులు సంభవిస్తాయనీ, ఆ సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయని చెబుతున్నారు. ఫొటోగ్రఫీ .. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పుకుంటున్నారు.
తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా ఈ ఐదు భాషల్లోను ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్ ను పవన్ కల్యాణ్ విడుదల చేయగా, తమిళ ట్రైలర్ ను జయం రవి .. మలయాళ ట్రైలర్ ను ఫాహద్ ఫాజిల్ .. కన్నడ ట్రైలర్ ను శివరాజ్ కుమార్ .. హిందీ ట్రైలర్ ను సోనూసూద్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ ఐదు భాషల్లోను కలుపుకుని ఈ ట్రైలర్ కి ఇంతవరకూ 60 లక్షలకి పైగా వ్యూస్ రావడం విశేషం. రానా .. అఖిల్ కూడా ఈ ట్రైలర్ ను షేర్ చేయడంతో, సినిమాపై అందరిలోను ఆసక్తి పెరుగుతోంది.











