తాతల, తండ్రుల లెగసీని కంటిన్యూ చేయడానికి నటవారసులు తెరంగేట్రం చేయడం అన్ని భాషల్లోనూ కామనే. అయితే అది హీరోగా వారి ప్రవేశానికి మాత్రమే పనికొస్తుంది. ఆపై ఎవరికి వారు నిరూపించుకోవాల్సిందే. వరుస విజయాలతో నిలదొక్కుకోవల్సిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు శాండిల్ వుడ్ లో ఓ సరికొత్త హీరో పుట్టుకొచ్చాడు. అతడు మరెవరో కాదు.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మనవడు యువరాజ్ కుమార్. ఇతడు రాజ్ కుమార్ రెండో కొడుకు రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడు.
యువరాజ్ కుమార్ ఎంట్రీనే ఓ భారీ జానపద చిత్రంతో జరుగుతోంది. టైటిల్ ఇంకా ఖాయం చేయలేదు. ప్రస్తుతం ఈ సినిమాని వై.ఆర్ 01 గా పిలుస్తున్నారు. పునీత్ రుద్రాంగ్ దర్శకత్వంలో తెరెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు. మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో, యువరాజ్ కుమార్ అద్భుతమైన డైలాగ్స్ తో .. కళ్ళు చెదిరే ఫైట్ సీక్వెన్స్ తో టీజర్ ను కట్ చేశారు. యువ రాజ్ కుమార్ లుక్.. చాలా ఫెరోషియస్ గానూ, హీరోయిక్ గానూ ఉంది. అతడు చేసిన ఫైట్స్ ఈ టీజర్ కే హైలైట్.
పెద నాన్న శివరాజ్ కుమార్ కన్నడ కరునాడ చక్రవర్తి, బాబాయ్ పునీత్ రాజ్ కుమార్ కన్నడ పవర్ స్టార్. ఇద్దరూ అక్కడ లీడింగ్ హీరోలు. యువరాజ్ అన్న వినయ్ రాజ్ కుమార్ కూడా హీరోగా రంగ ప్రవేశం చేశాడు. తొలి చిత్రం టీజర్ తోనే రాజ్ కుమార్ అభిమానుల్ని ఖుషీ చేసిన యువరాజ్ కుమార్ .. భవిష్యత్ లో కన్నడ చిత్ర సీమను ఖచ్చితంగా శాసిస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఈ సెప్టెంబర్ లో లాంఛ్ అయిన ఈ సినిమా .. టీజర్ తో అంచనాలు మరింతగా పెరిగాయి. సినిమా అద్భుతాలు సాధిస్తుందని నమ్ముతున్నారు మేకర్స్. మరి ఈ సినిమా యువరాజ్ కుమార్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.