టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. కుర్రకారుపై ఇప్పుడు ఈ పేరు ఒక మంత్రంలా పనిచేస్తోంది. స్టార్ హీరోలు .. ఆ తరువాత వరుసలో వున్న హీరోలు ఆమెతో చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ ను సంపాదించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సక్సెస్ అనేది కొంతకాలంగా పూజా హెగ్డేను వదలకుండా వెంటపడుతోంది. అదృష్టానికి కేరాఫ్ అడ్రెస్ గా ఇండస్ట్రీలో ఆమెను గురించి చెప్పుకుంటున్నారు.
పూజా హెగ్డే నిజంగానే అదృష్టవంతురాలేనని అనుకోవచ్చు. ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ నాజూకు సుందరి, ఆ వెంటనే ‘ముకుంద’ సినిమాతోను పలకరించింది. కుర్రాళ్లు ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలు పెడుతుండగా, బాలీవుడ్లో అవకాశం రావడంతో అటు వెళ్లిపోయింది. అక్కడ చేసిన ‘మొహంజోదారో’ నిరాశపరచడంతో, మళ్లీ వెంటనే వెనక్కి వచ్చేసింది. ఈ లోగా కొంత గ్యాప్ వచ్చింది. సాధారణంగా గ్యాప్ తీసుకున్నవారు తిరిగి పుంజుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ పూజా హెగ్డే అదృష్టవంతురాలు కదా, అందువలన ఆమె విషయంలో అలా జరగలేదు. ‘దువ్వాడ జగన్నాథం‘ సినిమాతో ఆమె దూసుకుపోయింది.
ఈ సినిమాలో ఆమె అందాల ఆరబోతకి మాస్ ఆడియన్స్ మతులుపోయాయి. తెరకి తగిలించిన చూపులను తిరిగి వెనక్కి తెచ్చుకోవడానికి కుర్రాళ్లు నానాఅవస్థలు పడ్డారు. ఒక్కసారిగా ఆమె క్రేజ్ పెరిగిపోయింది. అందుకు తగినట్టుగానే అవకాశాలు .. ఆ వెనుకనే విజయాలు ఆమెను చుట్టుముట్టాయి. ‘అరవింద సమేత‘ .. ‘మహర్షి’ .. ‘గద్దలకొండ గణేశ్’ .. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు ఆమెను తిరుగులేని నాయికగా నిలబెట్టాయి. లాక్ డౌన్ కారణంగా చాలామంది సినిమాలు వాయిదాపడితే, లాక్ డౌన్ కి ముందు కూడా ఆమె ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో హిట్ కొట్టడం ఆమె అదృష్టానికి మరో నిదర్శనంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం పూజా హెగ్డే నుంచి రావడానికి రెండు సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఈ రెండూ రొమాంటిక్ టచ్ తో కూడుకున్నవి కావడం మరో విశేషం. అఖిల్ జోడీగా ఆమె చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్‘ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది సంక్రాంతికే ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో విజయాన్ని అందుకున్న పూజా హెగ్డే, వచ్చే సంక్రాంతికి సిద్ధమైపోవడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి .. లిరికల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘మనసారా బతిమాలా మనసా’ అంటూ సిద్ శ్రీరామ్ పాడిన పాట యూత్ ను థియేటర్స్ కి రప్పించే సత్తా వున్నదే.
ఇక ఆ తరువాత సినిమాగా ఆమె ‘రాధే శ్యామ్‘ చేస్తోంది. పూజా హెగ్డే కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. దేశ వ్యాప్తంగా ప్రభాస్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అలాంటి హీరో జోడీగా ఆమె చేస్తున్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో సిద్ధమవుతున్న ఈ సినిమా కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత థియేటర్స్ కి వచ్చే క్రేజీ సినిమాల్లో పూజా హెగ్డేనే ముందు వుంది.
ఇక గుణశేఖర్ తాజా ప్రాజెక్టు ‘శాకుంతలం’లోను కథానాయికగా పూజా హెగ్డే పేరే వినిపిస్తోంది. ఆమెను ఒప్పించే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయట. ఆ పాత్రకి ఆమెనే కరెక్టుగా సెట్ అవుతుందనే అభిప్రాయాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందానికీ .. అభినయానికి .. అదృష్టం కలిసొస్తే ఇలాగే ఉంటుంది మరి.











