Sree Vishnu Hopes on Raja Raja Chora Movie :
వెండితెరపై హీరోగా కనిపించడం .. హీరో అనిపించుకోవడం చాలా కష్టమైన విషయం. హీరోగా ఆడియన్స్ అంగీకరించాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ .. విలక్షణమైన పాత్రల్లో వారికి వినోదాన్ని పంచుతూ వెళ్లాలి. బలమైన నేపథ్యం నుంచి వచ్చినవారికి కుదురుకోవడానికి కొంత సమయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి నేపథ్యం లేనివారికి ఇక్కడ అంత సమయం ఉండదు. అందుకే వచ్చిన ప్రతి అవకాశం విలువైనదే .. ముఖ్యమైనదే.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరో అనిపించుకున్నవారు ఇక్కడ చాలా తక్కువమందే కనిపిస్తారు. అలాంటి వారి జాబితాలో శ్రీవిష్ణు కూడా కనిపిస్తాడు. నారా రోహిత్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఇండస్ట్రీకి వచ్చిన శ్రీవిష్ణు, ఒకటి రెండు చెప్పుకోదగిన సినిమాలు చేశాడు. ఆయన ఫేస్ లోని అమాయకత్వం .. కామెడీలోని ఈజ్ ఆయనకి ప్లస్ అయ్యాయి. కెరియర్ పరంగా పెద్దగా గ్యాప్ రాకుండా చూసుకోగలుగుతున్నాడు గానీ, విజయాలను మాత్రం అంతగా అందుకోలేకపోతున్నాడు.
‘బ్రోచేవారెవరురా‘ సినిమా ఆయనకి మంచి ఊతాన్ని ఇచ్చింది. అయితే దానిని ఆసరా చేసుకుని ఆయన వెంట వెంటనే సక్సెస్ లను నమోదు చేయలేకపోయాడు. ‘తిప్పరా మీసం’ .. ‘గాలి సంపత్‘ సినిమాలు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నిరాశపరిచాయి. ఇక ఇప్పుడు ఆయన ఆశలన్నీ ‘రాజ రాజ చోర’ పైనే ఉన్నాయి. టైటిల్ ఆకట్టుకునేలా ఉంది .. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నని అబద్ధం చెప్పుకుంటూ తిరిగే ఆయన పాత్రకి కూడా మంచి మార్కులు పడేలానే ఉన్నాయి. ఆయన కెరియర్ పరంగా చూసుకుంటే, ఈ సినిమా హిట్ కొట్టవలసిన అవసరం చాలానే ఉంది. వినోదప్రధానమైన ఈ సినిమా మనసులు కొల్లగొట్టేస్తే, శ్రీవిష్ణు గట్టెక్కేసినట్టే!
Must Read ;- అందాలరాశికి ఇప్పుడు హిట్టు అత్యవసరం!











