తెలుగులో ఇప్పుడు యువ కథానాయకుల మధ్య గట్టిపోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికివారు తమ ప్రత్యేకతను చాటుకోవడానికి కృషి చేస్తున్నారు. డాన్సుల పరంగా .. ఫైట్స్ పరంగా దూసుకుపోతున్న హీరోల పోటీని తట్టుకుని నిలబడటానికి శ్రీవిష్ణు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. అలా వైవిధ్యం వైపు అడుగులు వేయడం ఆయనకి బాగానే కలిసొచ్చింది. ‘బ్రోచేవారేవురా’ సినిమా సాధించిన విజయం అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
యువ కథానాయకుల మధ్య పోటీ ఎంత బలంగా ఉన్నప్పటికీ, శ్రీవిష్ణు పొలోమని చెప్పేసి కథలను ఒప్పుకుంటూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథలో పాయింటు నిలబడాలి .. ఆ పాయింటులో తన పాత్ర నిలబడాలి .. థియేటర్లో సినిమా నిలబడాలి అనే కాన్సెప్టుతోనే శ్రీవిష్ణు ముందుకు వెళుతున్నాడు. ఈ కారణంగానే ఆయన చేతిలో ‘గాలి సంపత్’ .. ‘రాజ రాజ చోర’ .. ‘అర్జున ఫల్గుణ’ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వేటికవే విభిన్నమైనవే .. విలక్షణమైనవే.
ఈ ప్రాజెక్టులు మాత్రమే కాకుండా తాజాగా ఆయన అంగీకరించిన సినిమా కూడా వైవిధ్యభరితమైన కథాకథనాలతో కూడినదే. ఈ సినిమాకి ‘భళా తందనాన’ అనే టైటిల్ ను సెట్ చేశారు .. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సాయికొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి, చైతన్య దంతులూరి దర్శకత్వం వహించనున్నాడు. వారాహి బ్యానర్ కి గల క్రేజ్ కారణంగా ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తరువాత కథానాయికగా కేథరిన్ అలరించనున్న సినిమా ఇదే. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
Must Read ;- వారాహి వారి చేతికే కేజీఎఫ్ తెలుగు హక్కులు?