ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చుట్టూ హిందూత్వ వ్యతిరేకత కు సంబంధించిన వివాదాలు ముసురుకుంటున్నాయి. హిందూ ఆలయాల మీద వరుస దాడులు జరుగుతూ ఉంటే.. దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వం ఎందుకు విఫలం అవుతోందనేది విపక్షాల ప్రధాన ఆరోపణ. అయితే.. ఈ విమర్శనుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడానికి అనేకానేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఆరోపణలను పక్కదారి పట్టిస్తూ.. ఇతర విషయాలను హైలైట్ చేస్తూ.. విపక్షాల ఆందోళనలకు అంతరాయం కలిగిస్తూ.. అసలు సమస్య కంటె అవే పెద్ద రాద్ధాంతాలుగా చిత్రీకరిస్తూ ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ ముద్ర ఉన్న హిందూత్వ ఎజెండాతో తన అభిప్రాయాలను స్పష్టంగా వినిపిస్తూ ఉండే నాయకుడిగా పేరున్న సుబ్రమణ్య స్వామి మాత్రం.. అచ్చంగా జగన్మోహన్ రెడ్డి తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లుగా మాట్లాడుతున్నారు.
ఒక జాతీయ ఛానెల్ వారి చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ.. జగన్ మతం గురించి, దాన్ని గురించి జరుగుతున్న ప్రచారం గురించి చాలా విషయాలు ఏకపక్షంగా చెప్పుకొచ్చారు.
జగన్ కుటుంబం యావత్తూ క్రిస్టియానిటీని పాటిస్తూ ఉంటే.. ‘అసలు జగన్ క్రిస్టియన్ అని మీకెవరు చెప్పారు’ అంటూ సుబ్రమణ్య స్వామి లీగల్ పాయింటు తీయడం విశేషం. జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని మీకెవరు చెప్పారు.. ఆయన తెల్లవారుజామున రెండు గంటలకు తిరుమల ఆలయంలో తిరుమలేశునికి పూజలు నిర్వహించారు. కానీ, ఈ అంశానికి పెద్దగా ప్రచారం దక్కలేదు అని సుబ్రమణ్యస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్చిలకు వెళ్లడం లాంటివి ఎవరైనా చేయొచ్చునని అంతమాత్రాన క్రిస్టియన్ అని చెప్పడం తగదని స్వామి అంటున్నారు. జగన్ క్రిస్టియన్ అంటూ.. ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి పని గట్టుకుని, కుట్రపూరితంగా ప్రచారం చేయిస్తున్నారని కూడా ఆరోపించారు.
పనిలో పనిగా తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గురించి కూడా స్వామి వెనకేసుకు వచ్చారు. వైవీ క్రిస్టియన్ అనే ప్రచారమూ జరుగుతోందని.. ఇదంతా చంద్రబాబు కుట్ర అని తేల్చేశారు.
ఎందుకలగ?
జగన్ మోహన్ రెడ్డి మీద ఈగ వాలనివ్వకుండా ఈ హిందూత్వ ఎజెండా సుబ్రమణ్యస్వామి వకాల్తా పుచ్చుకోవడం ఇది తొలిసారి కాదు. గతంలో టీటీడీకి సంబంధించిన వచ్చిన సందర్భాల్లో కూడా.. ఆయన జగన్ పనితీరును సమర్థిస్తూ ప్రకటనలు చేశారు. ఇంటర్వ్యూలు ఇచ్చారు. నిజానికి సుబ్రమణ్యస్వామి హిందూత్వ ఎజెండాను తన వ్యక్తిగత మైలేజీకోసం వాడుకుంటూ ఉంటారే తప్ప.. ఆయనకు హిందూత్వ ప్రేమ ఏమీ లేదనే వాదనలు కూడా ఉన్నాయి.
సుబ్రమణ్యస్వామి తమిళ హిందువు అయినప్పటికీ.. ఆయన ఒక జొరాస్ట్రియన్ ను పెళ్లిచేసుకున్నారు. హార్వర్డ్ లో చదువుతున్నప్పుడు.. రోక్స్‌నా స్వామి పార్సీ మతం ఆచరిస్తారు. స్వామికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. చిన్న కూతురు సుహాసిని స్వామి ముస్లింను పెళ్లి చేసుకుని సుహాసిని హైదర్ గా మారారు. ఇలా సర్వమతసమ్మేళనం లా ఉండే తీరు సుబ్రమణ్య స్వామి కుటుంబానిది. ఆయన జగన్ క్రిస్టియన్ కానే కాదంటూ వకల్తా పుచ్చుకోవడంలో గానీ.. పనిగట్టుకుని ఇదంతా చంద్రబాబునాయుడు కుట్రపూరిత దుష్ప్రచారం అని ప్రచారం చేయడంలో గానీ.. వింతేమీ లేదని ఆయన ప్రకటన చూసిన వారు నవ్వుకుంటున్నారు.
Also Read: దేవునితో చెలగాటమాడితే తీవ్ర చర్యలు.. రామతీర్థం ఘటనపై స్పందించిన జగన్