చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఈ పేరు సుపరిచితమే. ఇంట్లో ఏమాత్రం మనకు నచ్చింది చేయకపోయినా… స్విగ్గి ఉందిగా అనుకుంనేంతగా పేరు సంపాదించుకుందీ ఫుడ్ యాప్. కానీ ఎవరూ అంత సులభంగా విజయం సాధించలేరు. ఈ మాట స్విగ్గి కి కూడా వర్తిస్తుంది. అసలు స్విగ్గి నెలకొల్పాలనే ఆలోచన ఎలా వచ్చింది? అందులో ఇంతటి విజయాన్ని సాధించడానికి వారు చేసిన కృషేమిటి? స్విగ్గి విజయగాధని తెలుసుకుందాం రండి…
అపజయమే వారి మొదటి అడుగు
స్విగ్గి వ్యవస్థాపకులు శ్రీ హర్ష మాజేటి, నందన్ రెడ్డి బిట్స్ పిలానీ క్యాంపన్ లో మొదటి సారిగా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఇద్దరూ ఫొటోగ్రఫి విభాగం లో కలిసి పనిచేయడం వల్ల ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ-కామర్స్ వ్యవస్ధలోని అవకాశాలను అందుపుచ్చుకుని ఇద్దరూ కలిసి ‘బండల్ టెక్నాలజీస్’ పేరుతో సరికొత్త బిజినెస్ ని స్థాపించారు. దీని ద్వారా కంపెనీ లకు కావాల్సిన పార్శిల్ సర్వీసులను అందించడం ప్రారంభించారు. కానీ, మొదలుపెట్టిన సంవత్సరానికే మూత వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సొంత అనుభవమే స్విగ్గికి బీజం
ఇలా వీరు కలిసి పనిచేస్తున్న సమయంలో భోజనానికి బాగా ఇబ్బందిపడేవారు. ఎక్కువగా బయటకు వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఒకవేళ ఫోన్ లో ఆర్డర్ చేయాలంటే కనీసం 500 వందలు ఆర్డర్ ఉంటే తప్ప డెలివరి చేసే వారు కాదు. అప్పుడు వచ్చిన ఆలోచనే ఫుడ్ డెలివరీ యాప్. కేవలం ఒక్క ఫుడ్ కి పరిమితం కాకుండా కోరుకన్న రెస్టరెంట్ నుండి వారు కోరుకున్న ఫుడ్ ని సకాలంలో అందించేలా డిజైన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది కేవలం ఆలోచనే, దానికి ఒక రూపు తీసుకురావడానికి కృషి చేశారు.
ఉద్యోగం వదులుకున్న రాహుల్
కొందరి కామన్ ఫ్రెండ్స్ ద్వారా రాహుల్ జైమిని ని కలిసారు ఈ ఇద్దరు స్నేహితులు. అప్పటికే ఒక ప్రముఖ సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తున్న రాహుల్ ఈ ఇద్దరి బిజినెస్ ఐడియా నచ్చడంతో వారితో కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డాడు. అందుకోసం ఉద్యోగం వదిలి దీనికి ఒక నిర్ధిష్ట రూపునివ్వడానికి తనవంతు కృషిని అందించాడు. చివరికి, ఇద్దరు కాస్త ముగ్గరుగా మారి నేటి అఖండమైన పేరు సంపాదించిన స్విగ్గికి వ్యవస్థాపకులుగా నిలిచారు.
అలా మొదలైంది
మొదట బెంగళూరులోని, కోరమంగల్ ప్రాంతంలో 5-6 డెలివరి బాయ్స్ ని ఏర్పాటుచేసుకుని, 15-16 రెస్టరెంట్లతో మాట్లాడుకున్నారు. అలా మొదలైన స్విగ్గి ప్రయాణం అంచలంచెలుగా ఎదుగింది. 2015 లో లైవ్ ట్రాకింగ్ పేరుతో మన డెలివరి ఎక్కడ ఉందో మనమే స్వయంగా తెలుకునేలా ఏర్పాటుచేసింది సంస్థ. 2014 చివరి వరకు కేవలం ఈ ముగ్గురు మాత్రమే దీని ఎదుగుదలకి ఎంతో కష్టపడ్డారు. ఒకానొక సమయంలో వారే స్వయంగా డెలివరీలు అందించిన సందర్భాలు కూడా లేకపోలేదు.
మా కష్టమే విజయానికి కారణం
మొదటిపెట్టిన వెంటనే ఎవరూ అఖండ విజయాన్ని అందుకోలేరు. స్విగ్గి అందుకు మినహాయింపు కాదు. మొదట్లో ఎలాంటి వాటిలోనైనా ఒడిదుడుగులు సహజం. వాటిని అధిగమించినపుడే విజయం అందుతుంది. ఇది తారక మంత్రంలా భావించి కష్టపడ్డారు కనుకనే నేడు సంపన్నుల జాబితాలో ఈ స్విగ్గి వ్యవస్థాపకులు కూడా చేరారు. మొదటి అపజయాన్ని పాఠంగా భావించి, ఆలోచనని అవకాశంగా మూర్చుకుని, నేడు వీరి ప్రయాణమే విజయగాధగా చెప్పుకునేలా ఎదిగారు.
Must Read ;- విజయవాడ కుర్రాడు…మళ్లీ సాధించేశాడు