రఘునందన్ రావు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపుతున్నాయి. ఏపీ మాజీ సీఎం, దివంగతనేత వైఎస్ఆర్ మరణంపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు వైఎస్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. దాదాపు 10 ఏళ్ల క్రితం సంభవించిన వైఎస్ మరణంపై రఘునందన్‌రావు చేసిన తాజా వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు మండిపడుతున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలపై రఘునందన్‌రావు తాజాగా మీడియాతో మాట్లాడారు. అందులో ఒక సందర్భంలో ఆయన వైఎస్ మరణంపై వ్యాఖ్యలు చేశారు. తాను సైన్స్ టీచర్ని.. ప్రకృతిని నమ్ముతాను. వెనుకట ఒకాయన గిట్లనే మాట్లాడి.. గట్టనే పోయిండు.. పావురాల గుట్టల. నువ్వు కూడా అంతే. యాక్షన్‌కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది. వైఎస్ పరిస్థితే తెలంగాణ సీఎంకు వస్తుందంటూ వైఎస్ఆర్ మరణాన్ని ఉద్ధేశిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైఎస్ అభిమానుల్లో, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. దీంతో రఘునందన్‌రావుపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికల్లో వైఎస్ అభిమానులు ఎవ్వరూ కూడా బీజేపీకు ఓటు వెయ్యొద్దని పోస్టులు పెడుతున్నారు.
మైనారిటీల ఓట్లపై బీజేపీ దృష్టి ..
ఓట్లు వెయ్యొద్దని పోస్టులు..
రఘునందన్ మాట్లాడిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రఘునందన్‌ను టార్గెట్ చేస్తూ వైఎస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న వైఎస్, వైసీపీ కార్యకర్తలు బీజేపీకి ఓటు వెయ్యొద్దని పిలుపునిస్తున్నారు. రఘునందన్ చేసిన చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్నికల్లో బీజేపీపై ఎంత వరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి మరి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జనాధరణ ఉన్న నేత. ఆయనకు తెలంగాణలోనూ అభిమానులున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్రతో అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు. ఆయన తీసుకొచ్చిన కొన్ని పథకాలు తిరిగి ఆయనను రెండవ సారి అధికారంలోకి కూర్చొబెట్టాయి. పేదల గుండెల్లో ఇప్పటికీ ఆయనకు స్థానం ఉంది. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాఫ్టర్‌లో చిత్తూరు జిల్లా పర్యటనకు సెప్టెంబర్2, 2009న వైఎస్ బయల్దేరి వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. వైఎస్‌తో సహా మొత్తం ఐదుగురు ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందారు. 25 గంటల తరువాత వైఎస్ ఆచూకి లభ్యమైంది. అప్పట్లో వైఎస్ మరణంపై అనేక పుకార్లు వెలువడిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే వైఎస్ మరణంపై రఘునందన్ చేసిన వ్యాఖ్యలను వైెఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
స్పందించిన రఘునందన్..
మీడియాలో వస్తున్న కథనాలపై రఘునందన్ రావు సోమవారం స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై దురుద్ధేశంతో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ సీఎం నాడు రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను నేను ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి గుర్తు చేశానన్నారు. నాడు నువ్వు చేసిన వ్యాఖ్యలు నీకు అన్వయించుకోవాలంటూ సీఎంకు హితవు పలికానని మీడియా సమావేశంలో మాట్లాడానని చెప్పారు. తాను చేయని వ్యాఖ్యలపై వైెఎస్ అభిమానులెవ్వరూ కూడా బాధపడకూడదని, దానిపై తాను విచారణ వ్యక్తం చేస్తున్నానని రఘునందన్ రావు పేర్కొన్నారు.
Also Read ;- తెలంగాణ వైసీపీ.. అలాంటిది ఒకటి ఉందా?